News

జస్టిస్ కురియన్ జోసెఫ్ మైనారిటిలలో ద్వేషాన్ని, భయాన్ని నింపుతున్నారు : జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్.

399views

“భారత్ కంటే మైనారిటిలకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన దేశం ప్రపంచంలో ఇంకేదైనా ఉందా?” అని ప్రశ్నిస్తున్నారు జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్. `మైనారిటీ అనే గుర్తింపు భారత్ లో వృత్తిపరమైన అభివృద్ధికి ఆటంకంగా మారింది’ అన్న జస్టిస్ కురియన్ జోసెఫ్ వ్యాఖ్యకు స్పందిస్తూ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ ఇలా అన్నారు.

“మైనారిటీ గుర్తింపు భారత్ లో వృత్తిపరమైన ప్రగతికి ఆటంకంగా మారింది” అన్న మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ వ్యాఖ్యలను జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్ ఖండించారు(నవంబర్,5). కురియన్ మైనారిటీల్లో ద్వేషాన్ని, భయాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. `ఈ వ్యాఖ్యలు చూసి ఎవరైనా ఆయన్ని (కురియన్) మతతత్వవాది అని అంటే అందులో పొరపాటు ఏమి లేదు’ అని జార్జ్ అన్నారు.

“హైకోర్ట్ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఉండి, ఆ తరువాత 18 ఏళ్ళపాటు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన తరువాత `మైనారిటీ గుర్తింపు’ వృత్తిపరమైన అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఆయన అంటున్నారు. ఆ విధంగా ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసారు. ఒక సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే ఇక మా సంగతి ఏమిటని మైనారిటీ వర్గాలలో సందేహాలను, అసంతృప్తిని కలిగించాలనుకున్నారు” అని జార్జ్ కురియన్ ఆరోపించారు.

మతంతో సంబంధం లేకుండా అందరూ జస్టిస్ కురియన్ ను గౌరవించారు. అయినా ఆయన తిరిగి వారికి భయాన్ని, ద్వేషాన్ని అందిస్తున్నారని జార్జ్ ఆరోపించారు. ఒకప్పటి తన సహోద్యోగికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం పట్ల మాట్లాడిన కురియన్ ఏదో తప్పు జరుగుతోందనే అలా చేసానని సమర్ధించుకున్నారని, ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా అప్పటి తన చర్యలకు సహేతుకమైన కారణాలను చూపలేకపోయారని జార్జ్ అన్నారు. గతంలో మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి కురియన్ అప్పటి ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

“సాధారణ ప్రజానీకానికి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి అంటే ఉన్నతమైన బాధ్యత. కాని కురియన్ మీడియాతో మాట్లాడినప్పుడు ఆ గౌరవానికి తగినట్లుగా వ్యవహరించలేదు. భారత్ లో మైనారిటీలకు సరైన గుర్తింపు లేదని ప్రపంచానికి చూపించాలని ఆయన ప్రయత్నించారు” అని మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ అన్నారు.

“ప్రపంచంలో ఏ దేశం భారత్ కంటే మైనారిటీలకు ఎక్కువ సురక్షితమైనది, స్నేహపుర్వకమైనదో ఆయన చెప్పాలి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక లలో ఏదైనా భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉందా? ఫలానా మతవర్గానికి చెందినవారంటే తనకు అసహ్యమని, ఆరు దేశాల నుంచి ఆ మత వర్గానికి చెందిన వారు తమ దేశంలో ప్రవేశించడానికి వీలులేదని స్వయంగా దేశాధ్యక్షుడే ప్రకటించే అమెరికాలో మైనారిటీల పరిస్థితి మెరుగ్గా ఉందా? లేదా చర్చ్ అధికారులను నియమించే అధికారం కేవలం రాణిగారికే పరిమితమైన ఇంగ్లాండ్ లో ఉందా? భారత్ లో మైనారిటీ లు అణచివేతకు గురవుతున్నారో, లేదో ఆయన తేల్చి చెప్పాలి. ఈ దేశపు బాధ్యతాయుత పౌరునిగా ఆయన ఈ విషయాన్ని వివరించాలి” అని జార్జ్ అన్నారు.

“కురియన్ జోసెఫ్ 2012 లో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా ఎంపికై ఉంటే ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం వచ్చేది. జస్టిస్ దీపక్ మిశ్రా తరువాత ఆ పదవిబాధ్యతలు స్వీకరించేవారు. అయితే 2012 లో మరో రాష్రానికి చెందిన మరో క్రైస్తవ న్యాయమూర్తి జోసెఫ్ కంటే ముందుగా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారనే విషయాన్ని ఆయన దాచిపెడతారు. ఆ క్రైస్తవ న్యాయమూర్తి సుప్రీం కోర్ట్ కు ఎంపిక కాకుండా తప్పించాలని జోసెఫ్ అనుకున్నారు. ఆ విధంగా తోటి క్రైస్తవునికే అన్యాయం చేయాలనుకున్న తన ఆలోచన కూడా బయటపడకుండా ఆయన జాగ్రత్తపడుతుంటారు. దీనిని బట్టి ఆయనది స్వార్ధపూరితమైన ఆలోచనే తప్ప మైనారిటీ వర్గపు ప్రయోజనాలను కాపాడాలనే సదుద్దేశ్యం కాదని స్పష్టమవుతుంది. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా బాధ్యతాయుతమైన పదవి నిర్వహించిన కురియన్ `అలా అయిఉంటే’, `ఇలా అయిఉంటే’ అంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడటం బాగుండలేదు’’ అని జార్జ్ వ్యాఖ్యానించారు.

“పదవీ విరమణ చేసిన తరువాత కురియన్ ఒక మాట అన్నారు. మతపరమైన విషయాల్లో కోర్ట్ లు జోక్యం చేసుకోరాదని. ఈ మాట శబరిమల తీర్పును ఉద్దేశించి కురియన్ అన్నారంటూ మీడియా కోడై కూసింది. కాని కొన్ని రోజులకే తాను అలా అనలేదని మాటమార్చారు. అయితే మత విశ్వాసాల గురించి, మైనారిటీల గురించి తను ఎప్పుడూ పట్టించుకుంటానని ప్రపంచానికి చెప్పడానికి ఆయన తాపత్రయపడుతుంటారు” అని జార్జ్ కురియన్ అన్నారు.

“ఆయన మైనారిటీ వర్గాల హక్కులు, స్వేచ్చను కాపాడే సంరక్షకుడిగా పేరు పొందాలని ప్రయత్నిస్తుంటారు. కొలిజియంలో సంవత్సరానికి పైగా సభ్యునిగా ఉన్నారు. ఆ సమయంలో మైనారిటీ వర్గం, ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన వారిని సుప్రీం కోర్ట్ న్యాయముర్తులుగా ఎంపిక చేయడానికి చొరవ తీసుకున్నానని ఆయన చెప్పగలరా? ముస్లిం వర్గం నుంచి కేవలం ఒక్కరు మాత్రమే న్యాయమూర్తిగా ఉండడానికి కారణమేమిటో ఆయన వివరించగలరా? మిగిలినవారికి న్యాయముర్తులుగా ఎంపిక కావడానికి ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటో ఆయన చెప్పగలరా?” అని జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్ ప్రశ్నించారు.

Source: Organiser