News

నెల్లూరు స్వర్ణాల చెరువులోని శివలింగ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రముగా పునర్నిర్మించాలి : స్వామీజీలు

238views

నెల్లూరు నగరంలోని స్థానిక స్వర్ణాల చెరువులోని శివలింగ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పునర్నిర్మించాలని వి. హెచ్. పి, భజరంగ్ దళ్ ల అధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట శ్రీ లలితా మహేశ్వరీ ఆశ్రమం అధిపతి శ్రీ రామాయణ మహేష్ స్వామి, నెల్లూరు దత్తాత్రేయ మఠం శ్రీ దయానంద స్వామి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు శుక్రవారం నెల్లూరు నగరములోని జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ రవీంద్ర రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ, నెల్లూరు చెరువు వద్ద వున్న వైష్ణవతి, అక్క కాళేశ్వర ఆలయాలు కాల గర్భంలో కలిసిపోయాయని, నేడు ముస్లిములు స్వర్ణాల చెరువు ఆక్రమణకు జెండాలు పాతి వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. కాగా రాగి పత్రాల శాసనాలు, రాతి శాసనాలు సేకరించి 1905వ సంవత్సరంలో అలన్ బటర్ వర్త్, వి. వేణుగోపాల్ చెట్టి కలిసి మద్రాసు ప్రెసిడెన్సీ ముద్రణ ప్రెస్ లో ముద్రించిన నెల్లూరు జిల్లా చరిత్ర, 2వ భాగంలోని 817వ పేజీలోని శాసనాల ప్రకారం దర్గా ప్రాంతంలో వైష్ణవతి ఆలయం ఆనవాళ్ళు వున్నాయని, 818, 819 పేజీలలోని శాసనం ప్రకారం స్వర్ణాల చెరువు తూర్పు భాగాన అక్క కాళేశ్వర ఆలయం మహేశ్వరులు అనువారి అధీనంలో ఉండేదని తెలుస్తోందని, మరో చరిత్ర ఆనవాళ్ళ ప్రకారం దర్గా ప్రాంతంలో కొంత భూమిని తిరు నాగేశ్వర ఆలయానికి బహుమతిగా ఇచ్చినట్లుగా శాసనాలు చెబుతున్నాయన్నారు.

కావున స్వర్ణాల చెరువులోని శిలింగంపై మత, విద్వేష పూరిత రాజకీయాలు చెయ్యడం తగదని, స్వర్ణాల చెరువులోని శివలింగ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పునర్నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు పి.శశి కుమార్, వి. హెచ్. పి రాష్ట్ర కార్యదర్శి మెంటా రామమోహన్ రావు, జిల్లా కార్యదర్శి డేగా మల్లారెడ్డి, బీ జే పీ కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్, మరి కొందరు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.