News

రాజస్థాన్ లో 74 శాతం, తెలంగాణాలో 69.1 శాతం పోలింగ్ : గెలుపుపై ఇరు వర్గాలు ధీమా.

225views

రాజస్థాన్ లో 74 శాతం, తెలంగాణాలో 69.1 శాతం పోలింగ్ : గెలుపుపై ఇరు వర్గాలు ధీమా.

 

2019 సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్స్ గా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్న 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 11న చేపట్టనున్నారు.

కాగా శుక్రవారం రాజస్థాన్ లో జరిగిన పోలింగ్ లో రాజస్థాన్లో 74 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఒకట్రెండు ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు మినహా అవాంఛనీయ సంఘటనలేమీ చోటు చేసుకోలేదు. కాగా రాజస్థాన్ శాసన సభకు మొత్తం 200 స్థానాలు వుండగా ఒక అభ్యర్ధి మృతి చెందడంతో 199 స్థానాల్లోనే పోలింగ్ నిర్వహించారు.

తెలంగాణా:

శుక్రవారం తెలంగాణా శాసనసభలోని మొత్తం 119 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 69.1 శాతం పోలింగ్ నమోదయ్యింది. మొత్తం మీద చెదురు మదురు ఘటనలు మినహా తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా రీపోలింగ్ నిర్వహించ్చాల్సిన పరిస్థితి తలెత్త లేదు.

ఎగ్జిట్ పోల్స్:

ఎన్నికలు ముగుసిన తరుణంలో 5 రాష్ట్రాల్లో అందరూ ఎగ్జిట్ పోల్స్ పై చర్చిస్తుండటం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ మధ్య ప్రదేశ్, చత్తీస్ గడ్ లలో భాజపా విజయం సాధిస్తుందని చెబుతూండగా, తెలంగాణాలో తెరాసకు, రాజస్థాన్లో కాంగ్రెస్ కు అనుకూలంగా వున్నట్లు చెబుతున్నాయి. కాగా మిజోరంలో కాంగ్రెస్, బీఎస్పీ ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగాబోతున్నది. ఇరు పక్షాలూ సమ ఉజ్జీలుగా నిలవబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ 5 రాష్ట్రాలలోప్రధాన ప్రత్యర్ధులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ చత్తీస్ గడ్ లలో భాజపా విజయం అంత తేలికేమీ కాదని ఇరు పక్షాల మధ్యా గట్టి పోటీ నెలకొని వుందని, తమకూ విజయావకాశాలు వున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి రహిత పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపించబోతున్నాయని, తమ విజయం ఖాయమని భాజపా వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

కాగా రాజస్థాన్ లో భాజపా, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్సే అతి పెద్ద పార్టీగా అవతరించబోతున్నదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్న తరుణంలో కాంగ్రెస్ సహజంగానే ధీమాగా వుండగా, ప్రజలలో మీడియా చెప్పినంతగా భాజపా పాలన పై వ్యతిరేకత లేదని, సహజంగా పాలక పక్షంపై కొంత వ్యతిరేకత ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా నేరుగా లబ్ది పొందిన 50 లక్షల పైచిలుకు కుటుంబాలు తమకు అండగా నిలవబోతున్నాయని, స్వల్ప తేడాతో అయినా విజయం సాధించి తీరుతామని భాజపా వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

నాలుగు రాష్ట్రాలలో అంచనాలు ఇలా వుండగా తెలంగాణలో మాత్రం జాతీయ మీడియా సర్వేకి, ఉభయ తెలుగు  రాష్ట్రాల్లో ప్రజలు, రాజకీయ పండితులు గట్టిగా విశ్వసించే లగడపాటి సర్వేకి మధ్య వున్న వ్యత్యాసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకి దారి తీసింది. తెలంగాణలో తెరాసదే పై చేయని జాతీయ మీడియా ముక్త కంఠంతో చెబుతుండగా, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికే అత్యధిక స్థానాలు లభిస్తాయని లగడపాటి సర్వే చెబుతున్న నేపధ్యంలో తెలంగాణా ఫలితాలపై ఇరు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ సంగతి ఎలా వున్నా ఫలితాల కోసం ఈ నెల 11 వరకు ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ఉత్కంఠ తప్పదు.