News

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కు శ్రీ భగవాన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ సాయం: 15 లక్షల విలువైన పరికరాల విరాళంతో చేయూత.

274views

జైనులు అనాదిగా తమ సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉంటారని, నేటి తరం కూడా దానిని ఆచరిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ వుండటం అభినందనీయమని ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్ ఆదిత్య గారు తెలిపారు. గురువారం నెల్లూరుకు చెందిన జైనులు, శ్రీ భగవాన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ కు 1 వెంటిలేటర్, 4 మానిటర్లు, 3 ఇంఫ్యుజన్ పంపులు, 3 సిరంజ్ పంపులు, 10 ఐ.సి.యు పడకలు మొదలగు పరికరాలను అందించారు.

ఈ సందర్భంగా శ్రీ ఆదిత్య మాట్లాడుతూ జైనులు దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా సంస్థలను స్థాపించి, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఆరెస్సెస్ దేశ వ్యాప్తంగా లక్షా యాభై వేల సేవా కార్యక్రమాలు నడుపుతోందని, అలా ఆరెస్సెస్ అధ్వర్యంలో నడిచే సేవా కార్యక్రమాలకు దేశం మొత్తం మీద జైన సమాజం యొక్క సంపూర్ణ సహకారం లభిస్తోందని తెలిపారు.

ట్రస్టు నిర్వాహకులు మాట్లాడుతూ 1982 నుంచి గత 26 సంవత్సరాలుగా జయభారత్ హాస్పిటల్ నెల్లూరు జిల్లా ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తోందని, పేద, సామాన్య ప్రజలకు అందుబాటులో వుండే ఫీజులతో అత్యుత్తమమైన సేవ లందించటంలో జయభారత్ అగ్ర భాగాన నిలుస్తోందని, జయభారత్ సేవలు మరింత విస్తృత పరచే ఉద్దేశ్యంతోనే ఈ సాయమందిస్తున్నామని తెలిపారు.

మహావీర్ ట్రస్ట్ సాయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని, పేద ప్రజలకందించే సేవల్ని మరింతగా విస్తృత పరచేందుకు ఈ సాయం దోహదపడుతుందని, తమ కృషికి తగిన ప్రేరణ లభించినట్లయిందని హాస్పిటల్ ఉపాధ్యక్షుడు శ్రీ సుబ్బారావు పేర్కొన్నారు.

అనంతరం హాస్పిటల్ యాజమాన్యం శ్రీ భగవాన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ మోహన్ లాల్ జైన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చోహన్ రాజ్ జైన్, మేఘ రాజ్ జైన్, హాస్పిటల్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి,మేనేజరు శ్రీ గురుప్రసాద్, కోశాధికారి శ్రీ రాఘవులు, శ్రీ గుర్రం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.