News

ఆఫ్ఘన్‌ మహిళా ఉద్యోగులు ఇక‌ ఇంటికే పరిమితం

104views
  • మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు

కాబుల్‌: మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలను కాలరాస్తూ, వారిని ఇంటికే పరిమితం చేసే తమ ఛాందస విధానాలను తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్‌లో క్రమంగా అమలు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు, తాజాగా రాజధాని కాబూల్‌ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు.

తాత్కాలిక మేయర్‌ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిరచారు. కాబూల్‌ నగరంలోని మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగినులు ఇకపై విధులకు రావల్సిన అవసరం లేదని, ఇళ్లకు పరిమితం కావాలని స్పష్టంచేశారు.
తాలిబన్ల పాలకులు తమకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

దీనితో ఇక్కడి మున్సిపాలిటీలో అతి కొద్ది మంది మహిళలే ఉద్యోగాలు చేసుకోవల్సి ఉంటుంది. మగవారు చేయలేని విధులు నిర్వర్తించే వారు తప్ప మిగిలిన ఉద్యోగినులు అంతా ఇకపై ఇంటిపట్టునే ఉండాలి. ‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్‌, ఇంజినీరింగ్‌ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని పేర్కొన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడిరచలేదు.

కాబూల్‌ నగర పాలక సంస్థలో సుమారు మూడు వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా. తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్‌లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమని మండిపడ్డారు.

వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్‌ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్‌ హమ్దుల్లా తెలిపారు. కాబూల్‌లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
కాబూల్‌ను నెల రోజుల క్రితం వశపర్చుకున్న తాలిబన్లు తమ మునుపటి తరహాలోనే స్త్రీలకు బురఖాలు వారి స్వేచ్ఛకు సంకెళ్లు పద్ధతినే పాటిస్తున్నారు.

ఎక్కడికక్కడ కార్యాలయాలకు వచ్చే ఉద్యోగినులను సాయుధ తాలిబన్లు గేట్ల వద్దనే నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో తాము స్వేచ్ఛగా కార్యాలయాలలోకి వెళ్లి తమ డ్యూటీలు చేసుకునే తమను పరాయిలుగా చేసి, ఇంటికి పంపిస్తున్న తంతుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లను ఎదిరించలేక కుమిలిపోతున్నారు.

ఇటీవలి కాలంలో తాలిబన్లు ఫత్వా తరహాలో వెలువరించిన ఆదేశాలలో విద్యార్థినులు ఎవరూ స్కూళ్లకు పోవద్దని, ఇప్పటికైతే ఈ ఆదేశాలు వెలువరిస్తున్నామని తెలిపారు. బాలలకు పోయిన వారం స్కూళ్లు ఆరంభం అయ్యాయి. స్కూళ్లు తెరుచుకున్నా తాము వెళ్లలేని స్థితితో విద్యార్థినులు ఇళ్లకే పరిమితం కావల్సి వచ్చింది. ఇక యూనివర్శిటీలకు వెళ్లే అమ్మాయిలు కాలేజీలలో ప్రత్యేక గదులలో లేదా పరదాలు ఏర్పాటు చేసిన హాళ్లలో విద్యాభ్యాసం కొనసాగించే పరిస్థితి ఏర్పడిరది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి