News

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావుచే సేవా భారతి అంబులెన్సులు ప్రారంభం

518views

డిచిన మూడున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న స్వచ్చంద సేవా సంస్థ సేవాభారతి. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవాభారతి సేవలు విస్తరించాయి. ఈ సేవా యజ్ఞంలో భాగంగా శనివారం చలసాని మాలతి మెమోరియల్ ట్రస్ట్ విజయవాడ ట్రస్టీ శ్రీ చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ ఆర్థిక సహకారంతో నాలుగు అంబులెన్సులను మరియు సేర్ బోలుమల్ ధరమ్ దాస్ చారిటబుల్ ట్రస్ట్, వికాస తరంగిణి జీయర్ స్వామి ట్రస్ట్ విజయవాడ వారి ఆర్థిక సహకారంతో ఒక మహాప్రస్థాన రథం ప్రారంభించడం జరిగింది. స్థానిక సత్యనారాయణపురంలోని శిశువిద్యా మందిర్ పాఠశాల ఆవరణలో సేవా భారతి అధ్యక్షులు డాక్టర్ వై సాయి కిషోర్ అద్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని సేవా భారతి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. గతంలో కూడా సేవా భారతి చేపట్టిన కార్యక్రమాలలో తాను పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

ప్రసంగిస్తున్న మంత్రి వెల్లంపల్లి, సేవా భారతి అధ్యక్షులు డాక్టర్ వై సాయి కిషోర్, చలసాని మాలతి మెమోరియల్ ట్రస్ట్ విజయవాడ ట్రస్టీ శ్రీ చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్, అఖిలభారత ఆరోగ్యమిత్ర సంయోజకులు డాక్టర్ మురళీ కృష్ణలు

నాలుగు అంబులెన్సులకు ఆర్థిక సహాయం అందజేసిన చలసాని మాలతి మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సేవా భారతి కార్యకర్తల సేవా నిరతి నిరుపమానం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలభారత ఆరోగ్య మిత్ర సంయోజకులు డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ సేవా భారతి ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సేవా సంకల్పంలో భాగంగా ముఖ్యంగా ఆరోగ్యము, విద్య, ఆవాసం, ఆహారము మొదలైన విభాగాలలో జరుగుతున్న పనిని వివరించారు.విజయవాడలో జరుగుతున్న ముఖ్యమైన విద్యా ప్రకల్పాలు అభ్యాసికలు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలలో పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత ఆలనా పాలనకు తల్లి తండ్రులు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి కుటుంబాలలోని పిల్లలను ఆదుకునేందుకు రూపొందించినది అభ్యాసిక స్వచ్ఛందసేవకులు ఆయా ప్రదేశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఆ పిల్లలకు విద్యలోను ఇతర రంగాలలోను శిక్షణ ఇస్తున్నారు. అటువంటి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు, పుస్తకాల సంచులు అందిస్తున్నామని అన్నారు.

అదేవిధంగా రక్తదానం చేసే వారి యొక్క సూచిని తయారు చేసి వారి ద్వారా రక్తదానం, నారాయణ పాత్ర అనే పేరుతో సమాజం నుండి బియ్యం మరియు దుస్తులు సేకరించి పేద కుటుంబాలకు అందించడం, సేవా బస్తీలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రతినిత్యం జరిగే సేవా ప్రకల్పాలు. చింతూరు కేంద్రం గా గత 22 సంవత్సరాలుగా 50పైగా గిరిజన గ్రామాల్లో 3 వేలకు పైగా ప్రజలకు వైద్యం అందించడం జరుగుతున్నదని అన్నారు. అక్కడి సంచార వైద్యశాల ద్వారా మరో 36 గిరిజన గ్రామాలకు వైద్య సేవ జరుగుతున్నది. ఆయా గిరిజన గ్రామాలలోని 10వ తరగతి పూర్తి చేసిన బాల బాలికలను విద్యా వికాస సమితి అనే ప్రకల్పం ద్వారా పై చదువులు పూర్తి చేయించి ఉద్యోగం లో చేరేలా పూర్తి బాధ్యతను చేపట్టి వందల మందికి ఉపాధి కల్పిస్తోంది అని అన్నారు.

ఈ సందర్భంగా సేవాభారతి విజయవాడ వారి వెబ్ సైట్ www.sevabharathivja.org ను కూడా మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ శ్రీ శ్రీరాం భరత్ కుమార్, సేవా భారతి జిల్లా కార్యదర్శి శ్రీ శుభ శేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి నాగలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.