ArticlesNews

జాతి మొత్తం ఛాతి విరుచుకునే మరో ఘట్టం

703views

మోడీ భారతంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయ్. స్వాతంత్రం అనంతరం…… ముఖ్యంగా 1980 ప్రాంతాల నుంచి రావణకాష్టంలా రగిలిపోతూ ఉండిన కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంతమేర ప్రశాంత వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు తెలిసిందే. అప్పుడప్పుడూ కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా తీవ్రవాద కార్యకలాపాలు కూడా దాదాపు కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు.

అలా భారత జాతి మొత్తం ఛాతి విరుచుకునే నిర్ణయాలనెన్నింటినో మోడీ ప్రభుత్వం తీసుకున్నది. అలాంటిదే మరొకటి. ఒకప్పుడు సంఘ, దేశ విద్రోహ శక్తులకు ఆలవాలంగా నిలచిన అందాల కాశ్మీరంలో దూరదర్శన్ చానల్ ద్వారా “వార్తావళి” పేరుతో సంస్కృత వార్తలు ప్రసారం చేయడం నిజంగా ఒక మహాద్భుత ఘట్టం. ఇదేం పెద్ద విషయం? అని కొందరు రొటీన్ గా పెదవి విరవవచ్చు. కానీ తీవ్రవాదుల కర్కశ పదఘట్టనలలో దశాబ్దాలపాటు నలిగిన కాశ్మీర్ లాంటి చోట ఇలాంటి ఒక సాహసోపేత ముందడుగు దేశంలో ఎవరూ ఊహించని మహత్తర పరిణామం. ఇప్పటి ఈ సంస్కృత వార్తలు విభజనవాదుల గుండెల్లో మ్రోగే భేరీ నాదాలనే చెప్పవచ్చు.

రాజకీయాలకతీతంగా యావద్దేశమూ మోడీ ప్రభుత్వం యొక్క ఇలాంటి నిర్ణయాలను హర్షాతిరేకాల మధ్య స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ మోడీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మందులేని రోగం కరోనా సృష్టించిన సంక్షోభాన్ని కూడా వదలని మన దేశంలోని సంకుచిత రాజకీయ నాయకులు జాతి ఏకతను, ఏకాత్మతను, సార్వభౌమత్వాన్ని ప్రతిఫలింపజేసే ఇలాంటి నిర్ణయాలను స్వాగతిస్తారనుకోవడం అత్యాశే అవుతుందేమో?

కానీ ఎవరు హర్షించినా హర్షించకపోయినా…. ఎవరు స్వాగతించినా స్వాగతించకపోయినా….. ఇది మాత్రం మోడీ ప్రభుత్వంలో…… అవును మోడీ భారతంలో మాత్రమే సాధ్యమైన, ఆవిష్కృతమైన ఒక మహాద్భుతం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.