News

ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం

463views

త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 14 మంది జవాన్లు వీరమరణం పొందారు. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 9 మంది మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరికి బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్‌కు చెందిన వారున్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌ బృందం డీజీ అశోక్‌ జునేజా ఆదివారం వెల్లడించారు. బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరా తీస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గాయపడిన జవాన్లను బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు వీరు నివాళి అర్పించారు. అమిత్‌షా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్‌కు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.