News

టూల్ కిట్ కుట్రదారులపై కేసులు

547views

సామాజిక మాధ్యమంలో గ్రెటా థన్ బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్ కిట్‌’ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతో పాటు నికితా జాకబ్‌, శంతన్ లు కూడా కీలక సూత్రధారులని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలను సూచిస్తూ రూపొందించిన ‘టూల్ కిట్’ ‌ను వీరే గ్రెటా థన్ బర్గ్ ‌తో పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నమోదైన దేశద్రోహం కేసులో దిశరవి అరెస్టయ్యారు. అయితే, వీరిని విడుదల చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు, వ్యవసాయ సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకు విచారణలో తేలిన విషయాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఈ ‘టూల్ కిట్‌’ను చేరవేసేందుకు దిశ ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూపును కూడా ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌(సైబర్‌) సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, ఈ వాట్సాప్‌ గ్రూపును దిశ తొలగించినట్లు కూడా గుర్తించామన్నారు. అంతేకాకుండా, గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఖలిస్థాన్‌ గ్రూపునకు చెందిన పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌(పీజేఎఫ్‌) ఏర్పాటు చేసిన జూమ్‌ మీటింగ్‌లో నికితా జాకబ్‌, శంతను పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. అంతేకాకుండా టూల్ కిట్ ఎడిట్‌ చేసిన వారిలో నికితా జాకబ్ కూడా ఉన్నారని తెలిపారు.

ఇదిలాఉంటే, ఈ టూల్ కిట్‌ వ్యవహారంలో ఇప్పటికే దిశ రవిని అరెస్టు చేయడంతో పాటు ఇద్దరిపై అరెస్టు వారెంటు జారీ చేశారు. ‘టూల్ కిట్’ వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో నికితా జాకబ్‌, శంతనులపై పోలీసుల వినతి మేరకు ఢిల్లీ న్యాయస్థానం నాన్ ‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది.

ఏమిటీ టూల్ కిట్‌?

ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్‌.. ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టవలసిన కార్యక్రమాలను వివరిస్తూ ‘టూల్‌ కిట్‌’ అనే డాక్యుమెంట్ ‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. ట్విటర్‌ ఆందోళనలు, భారత రాయబార కార్యాలయాల వెలుపల నిరసన కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యల జాబితాను దీనిలో సూచించారు. ఈ టూల్ ‌కిట్ ‌కు దిశ రవి ఎడిటర్ ‌గా వ్యవహరించారని.. దీని తయారీలో, ప్రచారం కల్పించటంలో కూడా ఆమె కీలక కుట్రదారుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.