
తూర్పు లద్దాఖ్‌లో కయ్యానికి కాలుదువ్వుతూ.. ప్రకృతినీ లెక్క చేయకుండా భారీగా సైన్యాన్ని తరలించిన చైనాకు ఇప్పుడు వణుకు మొదలైంది. ఎముకలు కొరికే శీతల వాతావరణాన్ని డ్రాగన్ సేన తట్టుకోలేకపోతోంది. సరిహద్దు శిబిరాల్లోని బలగాలను నిత్యం మారుస్తున్నట్లు (రొటేట్) వెల్లడైంది. భారత సైనికులు మాత్రం మొక్కవోని దీక్షతో అదే ప్రాంతంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దశాబ్దాలుగా పోరాటం సాగించిన అనుభవం మన వీర జవాన్లకు అక్కరకొస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో చైనా దురుసుగా వ్యవహరిస్తూ తూర్పు లద్దాఖ్‌లో దాదాపు 60వేల మంది సైనికులను, భారీ ఆయుధాలను తరలించిన సంగతి తెలిసిందే. భారత్ కూడా దీటుగా స్పందించింది. చైనా.. పట్టుదలకు పోయి శీతాకాలంలోనూ బలగాలను అక్కడే కొనసాగిస్తోంది. దీంతో మన దేశం కూడా సైన్యాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకోలేదు. ఆ ప్రాంతం.. సముద్ర మట్టానికి దాదాపు 14వేల నుంచి 18వేల అడుగుల ఎత్తులో ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంటాయి. తీవ్ర చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డిసెంబర్‌లో అక్కడ 40అడుగుల మందంలో మంచు పేరుకుపోతుంది.
పెను సమస్యలు..
ఎత్తయిన ప్రదేశం కావడంతో అక్కడ ఆక్సిజన్ 25-65 శాతం వరకూ తక్కువగా ఉంటుంది. ఇంతటి చలిలో లోహపు వస్తువులను పట్టుకోవడం ప్రమాదకరం. చర్మంపై శీతల గాయాలవుతాయి. ఇంకా ఆక్యూట్ మౌంటెయిన్ సిక్‌నెస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరే హై ఆల్టిట్యూడ్ పల్మనరీ అడీమా, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్, మానసిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఆక్సిజన్ సరిపడా లభించకపోవడం వల్ల తలనొప్పి, ఒళ్లు తిప్పడం, అయోమయం వంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి.
అన్ని విధాలా సమాయత్తమైన భారత్…..
భారత్ శరవేగంగా స్పందించి వేల మంది సైనికులకు వసతి, శీతాకాల దుస్తులు, బూట్లను సమకూర్చింది. అమెరికా నుంచి నాణ్యమైన శీతాకాల దుస్తులను దిగుమతి చేసుకుంది. రవాణా విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించి సరిపడా సరకులను నిల్వ చేసుకుంది. సైనికులను భద్రంగా ఉంచడానికి పటిష్ఠమైన ‘స్మార్ట్ క్యాంప్’లను ఏర్పాటు చేసింది. వాటికి విద్యుత్, నీరు, హీటింగ్ వసతులను కల్పించింది. వ్యూహాత్మక అవసరాలరీత్యా.. సరిహద్దుకు చేరువలో ఉన్న సైనికులు ‘హీటెడ్ టెంట్ల’లో ఉంటున్నారు. ఇవన్నీ నాణ్యంగా ఉండేలా భారత సైన్యం చర్యలు చేపట్టింది.
నాసి రకం సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న చైనా బలగాలు….
చైనా బలగాలకు సమకూర్చిన శీతాకాల దుస్తులు, వసతి సౌకర్యాల నాణ్యత చాలా పేలవంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వస్తువుల నిర్వహణలో డ్రాగన్ సేనకు అనుభవం లేదు. దీంతో హడావుడిగా స్థానిక తయారీదారులతో వీటిని తయారు చేయించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. చలికాటుకు గురైన సైనికులను తరలించే చైనా హెలికాప్టర్లు, స్ట్రెచర్లు అక్కడ కనిపిస్తున్నాయని, సరాసరిన రోజుకో సైనికుడు ప్రాణాలు కోల్పోతున్నాడని పేర్కొన్నాయి. బలగాల నైతిక స్థైర్యం బాగా దెబ్బతిందని తెలిపాయి. దీంతో సరిహద్దుల్లోని బలగాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు నాణ్యమైన దుస్తులును వేగంగా సమకూర్చేందుకు తీరిగ్గా ఇప్పుడు ఒక కమిటీని చైనా సైన్యం ఏర్పాటు చేసింది. రానున్న కాలంలో తూర్పు లద్దాఖ్‌లో శీతల వాతావరణం మరింత విజృంభిస్తుంది. దాంతోపాటు డ్రాగన్ కష్టాలూ పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
సియాచిన్, కార్గిల్ అనుభవాలు..
పాకిస్థాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి తలపడిన అనుభవాలు భారత సైన్యానికి ఉంది. దశాబ్దాలుగా ఉగ్రవాదంతో పోరాడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ రక్షణలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. అక్కడ 21వేల అడుగుల ఎత్తులో మన బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. కార్గిల్‌లో 14వేల-15వేల అడుగుల ఎత్తయిన ప్రాంతాల్లోనూ మోహరించారు. హిమపాతం తీవ్రమయ్యే సమయంలో 5-6 నెలల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు లేని పరిస్థితుల్లోనూ భారత సైన్యం విధులు నిర్వర్తిస్తోంది. మంచు చరియలు విరిగిపడే వాతావరణంలోనూ మన గస్తీ ఆగడంలేదు. కార్గిల్, సియాచిన్ బ్యాటిల్ స్కూళ్లు, గుల్మార్గ్‌లోని హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ వంటి శిక్షణ కేంద్రాలు.. భారత్‌లో పర్వత ప్రాంత యోధులను తీర్చిదిద్దడంలో ప్రపంచ ఖ్యాతిని సాధించాయి. ఈ తరహా శిక్షణ, అనుభవం ఇప్పుడు భారత సైనికులకు అక్కరకొస్తోంది. ఈ అనుభవరాహిత్యం డ్రాగన్ సేనలో కొట్టొచ్చినట్లు కనపడుతోంది.
Source : Enadu