ArticlesNews

బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి కేంద్రం సమాయత్తం

98views

టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో దాని వల్ల తలెత్తే దుష్ప్రభావాలను అడ్డుకోవాలని మన దేశం నిర్ణయించింది. చైనా ప్రాజెక్టు వల్ల మన భూభాగంలో ఆకస్మిక వరదలతో పాటు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌లో బహుళ ప్రయోజన ప్రాజెక్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి టి.ఎస్‌.మెహ్ర మంగళవారం వెల్లడించారు. 10వేల మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణ ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపారు. బ్రహ్మపుత్ర ఉపనది అయిన సియాంగ్‌పై అరుణాచల్‌ ప్రదేశ్‌లో 9.2 శతకోటి ఘనపు మీటర్ల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌ను నిర్మించాలన్నది ఆ ప్రతిపాదన సారాంశం. దీని వల్ల మన దేశ అవసరాలకు తగినంత నీటిని నిల్వ చేసుకోవటంతో పాటు విద్యుత్తును ఉత్పత్తి చేసుకొనేందుకు వీలవుతుంది. వర్షాకాలంలో బ్రహ్మపుత్రకు 90 శాతం నీరు దాని ఉపనదుల నుంచే వస్తుందని మెహ్ర పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టు ప్రతిపాదనపై 1980 నుంచే చర్చలు జరుగుతున్నాయని జల్‌ శక్తి మంత్రిత్వశాఖకు చెందిన మరో అధికారి తెలిపారు.

బ్రహ్మపుత్రపై (టిబెట్‌లో యార్లుంగ్‌ జాంగ్పో) 60,000 మెగావాట్ల సామర్థ్యంతో భారీ జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చైనా ప్రభుత్వ విద్యుత్‌ సంస్థ ఛైర్మన్‌ యాన్‌ ఝియాంగ్‌ గత వారం ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర…చైనా, భారత్, బంగ్లాదేశ్‌లలో ప్రవహిస్తూ పలు ఉపనదులను తనలో విలీనం చేసుకుంటుంది. టిబెట్‌లో యార్లుంగ్‌ జాంగ్పో, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, అసోంలో బ్రహ్మపుత్రగా ఆకృతి దాల్చుతుంది.

భవిష్యత్తులో మరింత తరచుగా వరదలు!

మూడు దేశాల గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి వరదలు గతంలో ఊహించిన దాని కంటే మరింత తరచుగా, అధికంగా వస్తాయని ఓ అధ్యయనం పేర్కొంది. ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ అనే పత్రికలో ప్రచురితమైన కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుల కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. మానవ చర్యలతో తలెత్తే పర్యావరణ మార్పులే కాకుండా ఇతర కారణాలూ దీనికి దోహదం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 1956-1986 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ భూభాగంలోని బ్రహ్మపుత్ర నదిలో సగటున సెకనుకు 41వేల క్యూబిక్‌ మీటర్ల నీరు ప్రవహించగా 1987-2004 మధ్య ఆ ప్రవాహం 43వేల క్యూబిక్‌ మీటర్లకు పెరిగిందన్నారు. 1998లో బ్రహ్మపుత్రకు వచ్చిన వరదలు అంతకుముందు కన్నా రెండింతలుగా ఉన్నాయని పరిశోధన పత్ర రచయిత ముకుంద్‌ పాలట్‌ రావు తెలిపారు.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.