News

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు : ఏడుగురు చిన్నారులు మృతి, 70 మందికి గాయాలు

69views

పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం మంగళవారం భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగర శివారులో ఉన్న ‘ఇస్లామిక్‌ సెమినరీ’ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. తరగతులు జరుగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగుతో సెమినరీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోందని తెలిపారు. పేలుడులో ఐఈడీని ఉపయోగించినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. దాదాపు ఐదు కిలోల ఐఈడీని ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.

ప్రస్తుతం పరిసర ప్రాంతాల్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ దాడులకు బాధ్యత వహించలేదు. ఈ దాడిని పాకిస్థాన్ అధికార, విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అఫ్గానిస్థాన్‌తో సరిహద్దులు పంచుకునే ఖైబర్‌ పంఖ్తుంక్వా రాష్ట్రానికి పెషావర్‌ నగరం రాజధాని. ఒకప్పుడు ఉగ్రవాద దాడులకు ఇది కేంద్రంగా ఉండేది. భద్రతా సిబ్బంది, జన సమూహాలను లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులకు పాల్పడేవారు. ఉగ్రవాద దాడులతో పాటు వేర్పాటువాదుల వల్ల కూడా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతుండేవి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.