హాథ్రస్ ఘటనపై మీరు స్పందించడాన్ని మేం తీవ్ర తప్పిదంగా పరిగణిస్తున్నాం – ఐరాసకు స్పష్టం చేసిన భారత్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ ఘటనపై ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త స్పందించడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా హింసాత్మక ఘటనలపై ఐరాస సమన్వయకర్త స్పందించడం అనవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై ఓ బయటి సంస్థ వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికింది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు లభిస్తాయని గుర్తుచేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేకూరుతుందని తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్, బలరామ్‌పుర్ ఘటనలు సమాజంలో అట్టడుగున ఉన్న బలహీన వర్గాల మహిళలు, బాలికలకు రక్షణ కొరవడిన అంశాన్ని తెలియజేస్తోందని భారత్‌లోని ఐరాస సమన్వయకర్త పేర్కొన్నారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సామాజిక భరోసా, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. మహిళల రక్షణకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బలహీనవర్గాల వారి విషయంలో భద్రత సూచీలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా విదేశాంగ శాఖ స్పందించింది.





