
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీ కార్యాలయ అధికారులు కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయమై రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
గత శనివారం అర్ధరాత్రి దాటాక రథం దగ్ధమైంది. సుమారు 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని సుమారు 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం దగ్ధమవడంపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు సహా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలో కేసుపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోంశాఖకు లేఖ వ్రాసింది.