News

చైనా వ్యూహం అదేనా?

113views

భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లే పైకి కనిపిస్తున్నా.. వాస్తవానికి పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్నాయా? సరిహద్దుల నుంచి ఇప్పుడే బలగాలను వెనక్కి తీసుకోవడం డ్రాగన్‌కు ఇష్టం లేదా? భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఉపసంహరణ ప్రక్రియలో తాత్సారం చేస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తోంది. గల్వాన్‌ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి బలగాలను సత్వరం వెనక్కి తీసుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇందుకోసం ‘ఉపసంహరణ, ఉద్రిక్తతల తగ్గింపు విధానానికి (డీడీపీ) శ్రీకారం చుట్టాయి. ఎప్పటికప్పుడు కమాండర్ల స్థాయిలో చర్చలు జరుపుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.

డీడీపీ ప్రక్రియ చాన్నాళ్ల క్రితమే మొదలైనా.. ఇప్పటికీ ఇరు దేశాల బలగాలు చాలా చోట్ల ఎల్‌ఏసీకి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకుగాను మరోసారి కమాండర్ల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించాలని భారత్, చైనా తొలుత నిర్ణయించాయి. అయితే- ఎజెండాపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ సమావేశం కార్యరూపం దాల్చలేదని భారత సైనిక వర్గాలు ‘ఈటీవీ భారత్‌’తో చెప్పాయి. గల్వాన్‌ ఘర్షణ తర్వాత భారత్‌-చైనాల మధ్య ఇప్పటివరకు నాలుగు సార్లు కమాండర్ల స్థాయి చర్చలు జరిగిన సంగతి గమనార్హం.

పాంగాంగ్‌పైనే పట్టు పడుతూ..

సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ త్సొ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించడంపైనే చైనా సైన్యం ప్రధానంగా దృష్టిసారించింది. దానిపైనే తొలుత చర్చలు జరుపుదామంటూ పట్టు పడుతోంది. భారత్‌ మాత్రం అన్ని చోట్లా ఉద్రిక్తతలను తొలగిద్దామని.. సమావేశపు ఎజెండాలో అన్నింటినీ చేరుద్దామని డిమాండ్‌ చేస్తోంది. చైనా అందుకు ససేమిరా అంటోంది.

అసలు కుట్ర అదేనా..

ఎల్‌ఏసీ వెంబడి భూభాగం చైనా వైపు కాస్త చదునుగా ఉంటుంది. బలగాల నిర్వహణలో అది డ్రాగన్‌కు కలిసొచ్చే అంశమే. ఇక శీతాకాలంలో తూర్పు లద్దాఖ్‌లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సామగ్రి విషయంలో భారత్‌తో పోలిస్తే చైనాదే పైచేయి. చలి తీవ్రత బాగా పెరిగే వరకు బలగాలను డ్రాగన్‌ వెనక్కి తీసుకోకపోతే భారత్‌ కూడా అధిక సంఖ్యలో సైనికులు, ఆయుధ సామగ్రిని అక్కడ కొనసాగించాల్సి వస్తుంది. అందుకు మెయింటెనెన్స్‌ ఖర్చు తడిసి మోపెడవుతుంది. కరోనా విజృంభణతో ఇప్పటికే కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు అది శరాఘాతంగా మారుతుంది. ఈ వ్యూహంతోనే ఉపసంహరణ విషయంలో చైనా మీనమేషాలు లెక్కిస్తుండొచ్చని సైనిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బలగాల ఉపసంహరణ పూర్తికాలేదు: భారత్‌

తూర్పు లద్దాఖ్‌లో దాదాపు అన్ని సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి మళ్లాయంటూ చైనా ఇటీవల చేసిన ప్రకటనను భారత్‌ తోసిపుచ్చింది. కాస్త పురోగతి ఉన్నప్పటికీ.. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం స్పష్టం చేశారు.

Source : Enadu.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.