Newsvideos

50 ఏళ్ళుగా ఇసుకలోనే నాగేశ్వరుడు – లాక్ డౌన్ తో బయటపడ్డాడు

185views

రోనా వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని తమ కల సాకారం చేసుకునేందుకు వినియోగించారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు యువకులు. పెన్నా ఒడ్డున ఉన్న పెరుమాళ్లపాడు ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు దూరం తరలింది. 200ఏళ్ల క్రిందటి నాగేశ్వరాలయం మాత్రం అక్కడే మిగిలిపోయింది. కాలక్రమంలో ఆలయం కనిపించకుండా 35 అడుగుల ఎత్తుకు ఇసుక మేట వేసింది. గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో ఆ ఆలయం వెలికి తీయాలని అనుకున్నారు. సాధ్యం కాలేదు. ఎక్కడెక్కడో ఉన్న యువకులంతా కరోనా నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. అందరూ చందాలు వేసుకుని అధికారుల అనుమతితో మంగళవారం యంత్రాలతో ఇసుక తొలగించారు. పరశురామ ప్రతిష్ఠిత నాగేశ్వరస్వామికి వేమన కుటుంబీకులు నిర్మించిన ఆలయం బయటపడింది.

దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ ఆలయాన్ని చూసేందుకు పలువురు తరలి వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం RDO ఆలయం బయల్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం ఇసుకలో పూడిపోయి ఎన్నేళ్ళయినా తమ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆ ప్రాంతంలో ఆలయం ఉన్నట్లుగా నమోదయి ఉందని తెలిపారు. తన తల్లిని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా పరశురాముడు దేశం మొత్తం మీద అనేక ప్రాంతాలలో కోటి శివలింగాలను ప్రతిష్టించాడని, వాటిలో ఇదొకటని, రెండు వందల ఏళ్ళ క్రితం వేమన వంశీకులు ఈ ఆలయాన్ని నిర్మించారని, 80 ఏళ్ళ క్రితం వచ్చిన వెల్లువలో ఏరు తన దిశను మార్చుకున్న తరుణంలో గ్రామమంతా అక్కడి నుంచి తరలిపోయిందని, 50 ఏళ్ళ క్రితం వరకూ కూడా అక్కడ ఆలయం ఆనవాళ్ళు కనిపిస్తూ ఉండేవని, తదనంతర కాలంలో ప్రకృతిలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇసుక మేటలు పెట్టడంతో ఆలయం పూర్తిగా ఇసుకలో కూరుకుపోయిందని గ్రామస్తులు కొందరు తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.