
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఈరోజు సమావేశమైంది. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్ కుమార్, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 92 అంశాలపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి తితిదే ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. ఈ అంశమే టేబుల్ అజెండాగా సమావేశంలో ప్రతిపాదించారు. శేఖర్‌రెడ్డి ప్రతిపాదనకు తితిదే ఛైర్మన్, ఈవోలు సానుకూలంగా స్పందించారు.
భక్తులు ఇచ్చిన విరాళాలను కూడా టీటీడీ వెబ్ సైట్ లో సమగ్రంగా పొందుపరచాలని కూడా ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి సమావేశానికి విన్నవించారు. అంతేకాకుండా లాక్‌డౌన్ అనంతరం స్వామివారి దర్శనానికి అవలంబించవలసిన విధివిధానాలపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా స్వామివారి దర్శనం నిలిపివేయడంతో దేవస్థానం సుమారు 500 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది. ఆ రెవిన్యూ లోటును పూడ్చుకోవడం పై కూడా సమావేశంలో చర్చ జరిగింది. టీటీడీ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల విషయంపై కూడా సమావేశం చర్చించనున్నది.
నిరర్థక ఆస్తులు విక్రయించాలన్న తితిదే పాలకమండలి నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ధర్మకర్తల మండలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.





