
కాశ్మీర్లో మరోసారి పుల్వామా తరహా దాడికి యత్నించిన పాక్ ఉగ్రవాదుల పన్నాగాన్ని భారత భద్రతా దళాలు తిప్పి కొట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన ఒక తెల్ల రంగు శాంత్రో కారును భద్రతా దళాలు ఆపి తనిఖీ చేయగా అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే కారులోని వ్యక్తి భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు అతనిని పట్టుకునే ప్రయత్నం చేయగా అతను తప్పించుకొని పారిపోయాడు. ఆ వ్యక్తిని హిజ్బుల్ ఉగ్రవాదిగా పోలీసులు భావిస్తున్నారు. వెంటనే బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని కారులో అమర్చి ఉన్న IED బాంబును పేల్చివేసింది.
2019లో జరిగిన పుల్వామా దాడి తరహాలో ఒక భారీ పేలుడుకు పాక్ ఉగ్రవాదులు వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. కాగా కారుకు ఉన్న నంబర్ తప్పుడుదని, ఆ నంబర్ పుల్వామాలోని ఒక బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని, ఆ బైకును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబాల హస్తం కూడా ఉన్నదని పోలీసులు భావిస్తున్నారు.





