
విద్యా భారతి ఆంధ్ర రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ కర్నాటి హనుమంతరావు గారు (49) ఆకస్మికంగా మృతి చెందారు. ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ అయిన శ్రీ హనుమంతరావు నేటి (17/5/2020) సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారన్న వార్త తెలుసుకుని స్వయంసేవకులు అందరూ శోకసముద్రంలో మునిగిపోయారు.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన శ్రీ హనుమంతరావు బాల్యం నుంచే స్వయంసేవకులు. ఆయనకు ఒక అన్నయ్య, ఇద్దరు చెల్లాయిలు ఉన్నారు. తన డిగ్రీ (B.Sc) చదువు పూర్తయ్యాక 1993లో బూర్గంపాడు మండలంలో సేవా కార్యక్రమాలలో నిమగ్నులయ్యారు. ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రోజూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకన, సైకిల్ మీద ప్రయాణించి అనేక గ్రామాల్లో సేవా భారతి పాఠశాలలను నిర్వహించేవారు. అటవీ ప్రాంతంలోని బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఆయన చేసిన కృషిని నేటికీ అక్కడివారు స్మరించు కుంటూ ఉంటారు. ఖమ్మం జిల్లాలో అనేక సేవా భారతి పాఠశాలలను వారు ప్రారంభించారు.
1999 నుంచి 2000 వ సంవత్సరం వరకు భద్రాచలం జిల్లా (సంఘ జిల్లా) శారీరిక్ ప్రముఖ్ గా వారు బాధ్యత నిర్వర్తించారు. 2000 వ సంవత్సరం నుంచి వారు ప్రచారక్ గా కొనసాగుతున్నారు. 2000వ సంవత్సరంలో తొలుత వారు బూర్గంపాడు ఖండ ప్రచారక్ గా నియమించబడ్డారు. అనంతరం 2003వ సంవత్సరంలో భద్రాచలం జిల్లా ప్రచారక్ గా బాధ్యతలు చేపట్టారు. తదుపరి కొంతకాలం ఖమ్మం విభాగ్ ప్రచారక్ గా కొనసాగారు. 2008వ సంవత్సరంలో ప్రకాశం విభాగ్ ప్రచారక్ గా నియుక్తులయ్యారు. అనంతరం ఒక ఏడాది పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సహ సేవా ప్రముఖ్ గా కూడా పని చేశారు.
2019లో విజయవాడలో జరిగిన విద్యాభారతి వర్గలో శ్రీ లింగం సుధాకర్ రెడ్డి, శ్రీ ఓంకారం గార్లతో స్వర్గీయ హనుమంతరావు
సంస్థ ఆదేశానుసారం విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘటనా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హనుమంతరావు అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్లో విద్యా భారతి కార్యకలాపాల విస్తరణకు విశేషంగా కృషి చేశారు. రాయలసీమ ప్రాంతంలో విద్యాభారతి కార్య విస్తరణకు హనుమంతరావు గారు చేసిన కృషి అనితర సాధ్యమైనది.
సహజంగానే సేవా నిరతి కలిగిన శ్రీ హనుమంతరావు భద్రాచలం అటవీ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను అనన్య సామాన్యంగా నిర్వర్తించారు. మృదుస్వభావి, స్నేహశీలి అయిన శ్రీ హనుమంతరావు లేని లోటు పూడ్చలేనిది.