News

పాకిస్థాన్‌ కంటెంట్‌ను భారత్​లో ప్రసారం చేయొద్దు : నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

31views

పాకిస్థాన్‌లో రూపొందిన కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పాక్‌లో రూపొందిన ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ వెబ్‌సిరీస్‌ భారత్‌లో విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో మంత్రిత్వ శాఖకు పలు ఫిర్యాదులు, వినతులు అందాయి. దీంతో కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, స్ట్రీమింగ్ సేవలు పాకిస్థాన్​కు చెందిన కంటెంట్‌ను నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2025 మే 8న జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని, పాకిస్థాన్‌కు చెందిన స్ట్రీమింగ్‌ కంటెంట్‌ భారత్‌లో అందుబాటులో లేకుండా చూడాలని కేంద్రం సూచించింది. అయితే, పాక్‌లో రూపొందిన ఏ సినిమాను, వెబ్‌ సిరీస్‌ను భారత్‌లో అందుబాటులో ఉంచలేదని గతేడాది జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు తెలియజేసింది.

షోపై నిషేధం విధించాలని కోరుతూ ప్రధానికి లేఖ
ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌, హనియా ఆమిర్‌, సమన్‌ అన్సారీ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ డిసెంబరు 4వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే, ఈ షోను భారత్‌లో విడుదల చేయడం గతంలో ఇచ్చిన సూచనలు, సలహాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA), ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఈ షోపై నిషేధం విధించాలని కోరుతూ ఈ రెండు సినీ కార్మిక సంఘాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇదివరకే లేఖ రాశాయి. ఆ లేఖలో పాకిస్థాన్‌ను “ఉగ్రవాద దేశం”గా అభివర్ణించాయి. అది భారత్‌కు ఎప్పటికీ మేలు కోరదని స్పష్టం చేశాయి. ఈ సిరీస్ విడుదల దేశ ప్రజల మనోభావాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నాయి.”పుల్వామా దాడి అనంతరం, భారతీయ చిత్ర పరిశ్రమలో పని చేయకుండా పాకిస్థాన్​ కళాకారులపై AICWA నిషేధం విధించింది. పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్​ కళాకారులు, కంటెంట్‌పై ఆంక్షలు విధించింది” అని AICWA అధ్యక్షుడు సురేశ్​ శ్యామ్‌లాల్ గుప్తా సంతకం ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, పాకిస్థాన్​ సిరీస్ విడుదలపై తగిన చర్యలు తీసుకోవాలని FWICE పేర్కొంది. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖను, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధానమంత్రిని కోరింది.