
బిహార్: సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు బిహార్‌కు చెందిన మంటూ కుమార్. వివిధ రకాల మూలికలతో లడ్డూలు తయారు చేస్తూ ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు టర్నోవర్ సాధిస్తున్నారు. అంతేకాదు.. సుమారు 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
రోహ్తాస్ జిల్లా ససారామ్‌కు చెందిన మంటూ కుమార్ తొలుత ఉద్యోగం కోసం ముంబయి వెళ్లారు. అక్కడ మూడేళ్లకు పైగా పనిచేశారు. అయితే 2011లో బిహారీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సమయంలో ఎదురైన ఇబ్బందులు, అవమానాలతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు.
ఉద్యోగంపై ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మంటూ కుటుంబానికి తరతరాలుగా మూలికలతో ఔషధాలు తయారు చేసే అనుభవం ఉంది. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొత్త ఆలోచనతో మూలికల లడ్డూల తయారీ ప్రారంభించారు.
ప్రస్తుతం ఆయన సుమారు 15 రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. శొంఠి, పచ్చి పసుపు, మెంతులు, అవిసె గింజలు, అశ్వగంధ వంటి పదార్థాలతో ప్రత్యేక రకాల లడ్డూలను రూపొందిస్తున్నారు.
మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు..
పట్నాలోని ఖాదీ మాల్లో మంటూ కుమార్ తయారు చేస్తున్న లడ్డూలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాల్లోనూ తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నారు.ఒకప్పుడు ఉద్యోగం కోసం ముంబయికి వెళ్లిన వ్యక్తి.. స్వస్థలానికి తిరిగొచ్చి తన కుటుంబ సంప్రదాయ పరిజ్ఞానంతో వ్యాపారాన్ని ప్రారంభించి, నేడు లక్షల్లో టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగారు.
సంప్రదాయ జ్ఞానం, స్వయం ఉపాధి ఆలోచన, కష్టపడే తత్వం కలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ విజయవంతమైన వ్యాపారాలను నిర్మించవచ్చని మంటూ కుమార్ ప్రయాణం తెలియజేస్తోంది.





