News

సింహగిరిపై శ్రీనృసింహ దీక్షలకు శ్రీకారం

0views

సింహాచలం: సింహాద్రి అప్పన్న స్వామిపై భక్తితో ఏటా భక్తులు ఆచరించే శ్రీనృసింహ మండల దీక్షలు సింహగిరిపై సోమవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షధారణ కార్యక్రమం భక్తి పారవశ్యంతో సాగింది.

ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల నేతృత్వంలో అర్చక పరివారం ప్రత్యేక పూజలు నిర్వహించింది. తొలుత ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు, అధికారులు, అర్చకులు దీక్షధారణ సామగ్రిని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేయించి స్వామివారి అంతరాలయంలో ఉంచి పూజలు నిర్వహించారు.

అనంతరం మాడవీధుల మీదుగా ఊరేగింపుగా ఆలయ ఉత్తర గోపురం సమీపంలోని వార్షిక కల్యాణోత్సవ వేదికకు చేరుకున్నారు. అక్కడ అప్పన్న స్వామి నమూనా విగ్రహం వద్ద తులసి మాలలు, రాగిమాడలకు అర్చకులు ఆవాహన పూజలు నిర్వహించి, దీక్ష చేపట్టిన భక్తులకు మాలధారణ చేశారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో వెంకటరావు మాట్లాడుతూ.. డిసెంబర్ 2న 32 రోజుల శ్రీనృసింహ మూలమంత్ర దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. మండల, మూలమంత్ర దీక్షలు జనవరి 2న ముగుస్తాయని వెల్లడించారు. భక్తులు దేవస్థానం సూచించిన తేదీల ప్రకారమే మాలధారణ, దీక్ష విరమణ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో శ్రీనివాసరావు, పర్యవేక్షకుడు సూర్యనారాయణ పర్యవేక్షించారు.