
భారతదేశ ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మికత, ధ్యాన సంప్రదాయాలకు అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఉన్న ధ్యాన గది కోసం భారతదేశం ‘ది గోల్డెన్ సన్’ అనే అద్భుతమైన కళాఖండాన్ని బహూకరించింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి భారతదేశం సమర్పించిన తొలి కళాఖండంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ కళాఖండంలో ప్రకాశవంతమైన బంగారు సూర్యుడు మధ్యలో దర్శనమిస్తుండగా, దాని చుట్టూ సంస్కృత మంత్రాలు అలంకరించబడి ఉన్నాయి. భారతీయ ధ్యాన సంప్రదాయం, ఆధ్యాత్మిక చింతన, అంతర్గత శాంతికి ఇది ప్రతీకగా నిలుస్తోంది.
ప్రముఖ కళాకారుడు డాక్టర్ ఉదయరాజ్ గాడ్నిస్ ఈ కళాఖండాన్ని రూపొందించగా, జల్పా విఠలాని పర్యవేక్షణలో ఇది రూపుదిద్దుకుంది. నవంబర్ 17న జెనీవాలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి అరిందమ్ బాగ్చి దీనిని అధికారికంగా సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయ డైరెక్టర్ జనరల్ టాటియానా వలోవాయా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ పాల్గొన్నారు.
‘ప్రపంచ శాంతి అనేది ప్రతి ఒక్కరి అంతరంగంలోని శాంతితోనే ప్రారంభమవుతుంది’ అనే భారతీయ తాత్విక సందేశాన్ని ఈ కళాఖండం ప్రపంచానికి చాటిచెబుతోంది. భారతీయ సనాతన సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవం విశ్వవ్యాప్తమవుతున్నాయనడానికి ఇది మరో గొప్ప నిదర్శనం.





