News

బెంగళూరులో మదర్సాల నిర్వహణపై వివాదం.. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!

2views

కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు విద్యాసంస్థల నిర్వహణపై వివాదం నెలకొంది. థానిసాంద్ర ప్రాంతంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘జామియా మహమూదియా మన్సూరా రెసిడెన్షియల్ స్కూల్’, ‘సమర్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కూల్’ వ్యవహారం తాజాగా కర్ణాటక హైకోర్టుకు చేరింది. ఈ సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

బెంగళూరులోని పద్రాయనపురకు చెందిన చాంద్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ, విద్యాశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు సంబంధిత సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ తరఫున న్యాయవాది లక్ష్మి అయ్యంగార్ వాదనలు వినిపించారు.

గుర్తింపు రద్దయినా కొనసాగుతున్నాయా?
పిటిషనర్ తన పిటిషన్‌లో పలు కీలక ఆరోపణలు చేశారు. విద్యాశాఖ 2025 మే 30న సంబంధిత సంస్థల గుర్తింపును రద్దు చేసినప్పటికీ, అవి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైనట్లు పిటిషన్‌లో వివరించారు.ఈ సంస్థలు మహారాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదయ్యాయని, వాటి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉందని పిటిషనర్ ఆరోపించారు. బెంగళూరులో ‘అల్-జామియా మహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ విద్యాసంస్థల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన పలువురు ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. అంతేకాకుండా, సంబంధిత సంస్థకు ప్రభుత్వం రూ.5 లక్షల గ్రాంటు అందించినట్లు కూడా పిటిషన్‌లో ఆరోపించారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, అల్-జామియా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యకలాపాలపై పోలీసులతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరారు. అవసరమైతే మొత్తం వ్యవహారాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన కర్ణాటక హైకోర్టు సంబంధిత ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థల గుర్తింపు, రిజిస్ట్రేషన్, నిధుల కేటాయింపు, కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వ వివరణ కీలకంగా మారింది.