News

ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ చొరవతో హిందూ శ్మశానవాటికకు మహర్దశ..

0views

ఎన్టీఆర్ జిల్లా: గ్రామ అభివృద్ధి కోసం ఒక సాధారణ పౌరుడు బాధ్యత తీసుకుంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాగలడో కేతనకొండ గ్రామంలో జరిగిన ఈ సంఘటన నిరూపిస్తోంది.

మైలవరం ఖండ్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామం నుంచి కొటికలపూడి వెళ్లే మార్గంలో ఉన్న హిందూ శ్మశానవాటిక తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం పిచ్చిమొక్కలు, కంపచెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. పంచాయతీ వ్యర్థాలను సైతం అక్కడే వేస్తుండటంతో శ్మశానవాటిక పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన ఆర్‌ఎస్‌ఎస్ కొటికలపూడి గ్రామ వికాస్ మైలవరం ఖండ్ సంయోజక్, గోపాలరావు గ్రామ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు గ్రామంలో పలువురిని కలిసి శ్మశానవాటిక అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఈ క్రమంలో పగడాల రామాంజనేయులు ముందుకు వచ్చి సహకరించగా, పత్రి చలపతిరావు ఆధ్వర్యంలో జేసీబీ, చైన్ మిషన్‌లను ఏర్పాటు చేసి శుభ్రత పనులు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యువకులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తిరుమలరావు, కృష్ణ, విఘ్నేశ్వరరావు తదితరులు తమ వంతు సహకారం అందించారు.

శ్మశానవాటిక అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు
కేవలం శుభ్రత పనులతోనే ఆగిపోకుండా, శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ నిర్మాణం, దహన సంస్కారాల కోసం ప్రత్యేక షెడ్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్థులు చర్చించారు.
గ్రామ సమస్యలను ప్రభుత్వంపై మాత్రమే వదిలేయకుండా, ప్రజలే బాధ్యత తీసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సంఘటన చాటిచెబుతోంది.