
హరిద్వార్: సనాతన విలువలు, భారతీయ సంస్కృతి పట్ల ఎవరూ సందేహించాల్సిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అంతర్జాతీయ సమాజం భారత్ వైపు ఆసక్తిగా చూస్తోందని ఆయన అన్నారు. మానవాళికి సరైన మార్గం చూపగల సత్తా భారతీయ ఆలోచనా విధానానికి ఉందని పేర్కొన్నారు.
హరిద్వార్‌లో అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతా భగవతి దేవి శర్మ జన్మ శతాబ్ది, అఖండ్ దీప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఏ సంస్థకైనా వంద సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేయడం సాధారణ విషయం కాదని, ఆ ప్రయాణాన్ని క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లడం మరింత పెద్ద పరీక్ష అని భగవత్ అభిప్రాయపడ్డారు. దైవ కార్యాలను నడిపించేందుకు భగవంతుడు నేరుగా రారని, తగిన వ్యక్తులు, సంస్థల ద్వారా ఆ బాధ్యతను నెరవేరుస్తారని తెలిపారు. మాతా భగవతి దేవి శర్మ సేవ, త్యాగం, మాతృత్వ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు.
సేవ, అంకితభావమే సంస్థలకు బలం
వందేళ్ల ప్రయాణంలో ఏ సంస్థకైనా విమర్శలు, సవాళ్లు ఎదురవ్వడం సహజమేనని, కానీ నిరంతర సేవా నిరతితో సమాజ విశ్వాసాన్ని, ఆదరణను సంపాదించుకోవచ్చని సర్సంఘ్చాలక్ చెప్పారు. సంఘ్, గాయత్రి పరివార్ చేపడుతున్న కార్యక్రమాలు విస్తరిస్తూ ముందుకు సాగడం ఒక దైవిక సంకల్పమని వ్యాఖ్యానించారు. రాముడి సేవలో తన జీవితాన్ని అర్పించిన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని, ప్రతి కార్యకర్త సనాతన సంస్కృతి పరిరక్షణ, సమాజ నిర్మాణంలో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
వేద మంత్రాల మధ్య శతాబ్ది వేడుకల ప్రారంభం
ఈ వేడుకలు వేద మంత్రోచ్ఛారణలు, శంఖారావాలు, మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. గాయత్రి పరివార్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీరామ్ శర్మ జన్మస్థలమైన ఆవల్ఖేడా (ఆగ్రా), తపోభూమి మధుర, కర్మభూమి హరిద్వార్ ప్రాంతాల నుంచి జ్యోతులతో మూడు కలశాలను వేదిక వద్దకు తీసుకొచ్చారు. సీనియర్ కార్యకర్తలకు మంగళ హారతితో స్వాగతం పలికారు. పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ కార్యక్రమానికి గాయత్రి పరివార్ అధిపతి శైలదీది అధ్యక్షత వహించారు.
2026 ప్రత్యేకతపై ప్రస్తావన
ఉత్సవ కమిటీ నాయకుడు డాక్టర్ చిన్మయ్ పాండ్యా మాట్లాడుతూ, ఈ శతాబ్ది వేడుకలు ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. 2026 సంవత్సరం దైవిక కాంతి అవతరణ కాలంగా నిలుస్తుందని మహర్షి అరబిందో చేసిన సూచనను గుర్తుచేశారు. మాతా భగవతి దేవి శర్మ జీవితమంతా సాధన, త్యాగం, సమాజ సేవకే అంకితమైందని, ఆమె నిర్వహించిన అశ్వమేధ మహాయజ్ఞాలు ఆమె సంకల్ప బలానికి నిదర్శనమని కొనియాడారు.
ఆధ్యాత్మిక ప్రముఖుల ఆశీస్సులు
సంస్థ గొప్పతనం భవనాలు లేదా వనరుల్లో కాకుండా, అక్కడి కార్యకర్తల వ్యక్తిత్వం, విలువల్లో ఉంటుందని స్వామి రాజరాజేశ్వరాశ్రమం అన్నారు. కార్యక్రమంలో స్వామి హరిచైతనానందజీ, స్వామి పరమాత్మానందజీ, స్వామి విశ్వేశ్వరానంద గిరి మహారాజ్, సూరత్గిరి బంగ్లా పీఠాధిపతి తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని ఆశీర్వచనాలు అందించారు. డాక్టర్ చిన్మయ్ పాండ్యా అతిథులకు గాయత్రి మహామంత్ర పత్రం, రుద్రాక్ష మాల, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ వేడుకల్లో 40 దేశాల నుంచి వచ్చిన గాయత్రి పరివార సభ్యులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.




