News

ఇండోనేషియాలో అద్భుత వినాయక విగ్రహం.. 50 అడుగుల ఎత్తుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు

0views

హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు మరో విశేషం చేరింది. ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఏకంగా 50 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ గణనాథుడి విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బాలిలోని జియాన్యార్ ప్రాంతంలో ఓ పర్యాటక కేంద్రం వద్ద ఈ అద్భుత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 15.315 మీటర్లు (సుమారు 50.2 అడుగులు) ఎత్తున్న ఈ విగ్రహం సింథటిక్ రట్టాన్ (పాలీఇథిలీన్ ప్లాస్టిక్)తో నిర్మించిన అతిపెద్ద కళాఖండంగా గిన్నిస్ రికార్డు సాధించింది.

ప్రపంచంలో ఈ విగ్రహం కంటే ఎత్తయిన విగ్రహాలు ఉన్నప్పటికీ, ఒక పీఠంపై ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తయిన ప్లాస్టిక్ విగ్రహంగా ఇది రికార్డులకెక్కింది. పీఠంతో కలిపి ఈ విగ్రహం మొత్తం ఎత్తు 72 అడుగులకు పైగా ఉంటుంది.

ఈ భారీ వినాయక విగ్రహాన్ని రూపొందించడానికి 126 మంది స్థానిక కళాకారులు కృషి చేశారు. వారి నైపుణ్యం, కళాత్మక ప్రతిభతో గణపయ్య విగ్రహం అద్భుత రూపాన్ని సంతరించుకుంది.

ఈ రికార్డును ఇండోనేషియాలోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరించింది. ఈ విశేషాన్ని ఢిల్లీలోని ఇండోనేషియా రాయబార కార్యాలయం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది.

విదేశీ గడ్డపై ఇంత భారీ వినాయక విగ్రహం గిన్నిస్ రికార్డు సాధించడం భారతీయ హిందూ సంస్కృతి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. బాలికి వెళ్లే పర్యాటకులకు ఈ భారీ గణపయ్య విగ్రహం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.