
తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక ఏర్పాటు కింద నవంబర్ 24న కొండపై ఉన్న దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దేవస్థానానికి సంబంధించిన వారితోపాటు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కార్తీక దీపం వెలిగించాలని సూచించింది. అయితే ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ వద్ద కార్తికదీపం వెలిగించే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూనే అందులోని కొన్ని భాగాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
దర్గా సమీపంలోని రాతి స్తంభంపై సంప్రదాయ కార్తిక దీపం వెలిగించేందుకు అనుమతిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సర్వే స్తంభాలకు మతపరమైన స్వభావం సంతరించుకునే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో వాదించింది.
మదురైలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయానికి సంబంధించిన ఈ కార్తిక దీపం వివాదం, తిరుప్పరంకుండ్రం కొండపై దీపాన్ని ఎక్కడ, ఎవరు వెలిగించాలనే అంశం చుట్టూ తిరుగుతోంది. దశాబ్దాలుగా కొండ దిగువ వాలులోని ఉచ్చిపిళ్లైయార్ ఆలయానికి సమీపంలో ఉన్న దీప మండపంలో దీపాన్ని వెలిగిస్తున్నారు. దీనికి భిన్నంగా, హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో కొండ ఎగువన ఉన్న పురాతన రాతి దీప స్తంభమైన ‘దీపతూణ్’ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.




