
అడవుల్లో వందల ఏళ్ల నాటి చెట్లు ఉండటం సహజమే. అయితే కొన్ని వృక్షాలు ప్రకృతి సంపదగా మాత్రమే కాకుండా, స్థానిక ప్రజల విశ్వాసాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని మెల్ఘాట్ అడవుల్లో ఉన్న ఓ భారీ టేకు చెట్టు కూడా అలాంటిదే. సుమారు 400 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఈ వృక్షాన్ని అక్కడి గిరిజనులు నాలుగు తరాలుగా దైవంగా పూజిస్తున్నారు. అలాగే గ్రామపెద్దకు ఇచ్చే గౌరవంతో ‘సిప్నా పటేల్’ అని పిలుస్తూ, ప్రత్యేక సందర్భాల్లో సామూహిక పూజలు నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో మారితా గ్రామం ఉంది. ఇక్కడ కోర్కు గిరిజన తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, ఖండు నది ఒడ్డున ఓ భారీ టేకు చెట్టు ఉంది. అది దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగినదిగా వారు విశ్వసిస్తున్నారు. ఈ వృక్షాన్ని ‘సిప్నా పటేల్’ అని పిలుస్తారు. తమ పూర్వీకుల కాలం నుంచే ఈ చెట్టును పవిత్రమైనదిగా భావించి పూజిస్తున్నట్లు చెబుతున్నారు. అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నప్పటికీ, ఈ వృక్షానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. కోర్కు గిరిజనుల విశ్వాసాల ప్రకారం, ఈ చెట్టులో ‘గోమాజ్’ అనే దైవిక శక్తి కొలువై ఉంది. అందుకే దీనిని సాధారణ వృక్షంగా కాకుండా దైవంతో సమానంగా భావిస్తారు. గ్రామస్థులు నిత్యం చెట్టు వద్దకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు.
‘సిప్నా పటేల్’ అంటే ఏంటి?
కోర్కు భాషలో టేకు చెట్టును ‘సిప్నా’ అని పిలుస్తారు. ఇక ‘పటేల్’ అనే పదాన్ని సమాజంలో గౌరవప్రదమైన హోదా కలిగిన వ్యక్తిని సూచించేందుకు ఉపయోగిస్తారు. అడవిలో తన భారీ పరిమాణంతో ప్రత్యేకంగా కనిపించే ఈ చెట్టుకు గిరిజనులు అదే గౌరవాన్ని ఇస్తూ ‘సిప్నా పటేల్’ అనే పేరు పెట్టారు. ఈ వృక్షం చుట్టుకొలత సుమారు 3.5 మీటర్లు ఉంటుంది. మెల్ఘాట్ అడవుల్లోని పురాతనమైన, ప్రత్యేకమైన టేకు చెట్లలో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. అయితే ఈ చెట్టు నిజమైన వయస్సును నిర్ధరించే అధికారిక శాస్త్రీయ ఆధారాలు లేవు. తరతరాలుగా వస్తున్న కథనాలు, స్థానికుల విశ్వాసాల ప్రకారమే ఇది సుమారు 400 ఏళ్ల నాటిదని చెబుతున్నారు. ఈ విషయాన్ని గ్రామపెద్ద మహాను బెతేకర్ కూడా వివరించారు.
మెల్ఘాట్ ప్రాంతంపై పరిశోధన చేసిన ప్రొఫెసర్ డాక్టర్ ఏక్నాథ్ తట్టే ఈ వృక్షం విశిష్టతను వివరించారు. ఈ చెట్టు ప్రాధాన్యం దాని పరిమాణం, వయస్సుతో మాత్రమే ముడిపడి లేదని, గిరిజన సమాజాల సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తోందని చెప్పారు. పెంచ్, తడోబా, సహ్యాద్రి, కాళీ టైగర్ రిజర్వ్ వంటి అటవీ ప్రాంతాల్లోనూ ఇలాంటి భారీ వృక్షాలను స్థానిక గిరిజనులు ఎంతో గౌరవిస్తారని పేర్కొన్నారు. అటవీ శాఖ ఇటువంటి పురాతన వృక్షాల వయస్సు, కొలతలను నమోదు చేయడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరంగా వీటికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు, అడవుల చరిత్రను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని వివరించారు. అంతేకాకుండా ప్రకృతిని ఆరాధించే గిరిజన సంప్రదాయాలు, వారి జీవన విధానాలను అధ్యయనం చేయడానికి ఇలాంటి వృక్షాలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపారు.
వాణిజ్య విలువకు మించిన గౌరవం
భారీ కాండం, ఆకాశాన్ని తాకేలా విస్తరించిన కొమ్మలతో ఈ టేకు చెట్టు ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. టేకు చెట్లు బలం, మన్నిక, దీర్ఘకాలిక ఉపయోగం కారణంగా వాణిజ్యపరంగా ఎంతో విలువైనవి. కలపకు ఉన్న డిమాండ్ కారణంగా వీటికి మార్కెట్లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే మెల్ఘాట్ గిరిజనుల దృష్టిలో ‘సిప్నా పటేల్’ విలువను డబ్బుతో కొలవలేరు. వారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలతో ఈ వృక్షం విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరచుకుంది. తరతరాలుగా దైవంగా పూజలందుకుంటూ వస్తున్న ఈ చెట్టు, ప్రకృతిని కాపాడటమే కాకుండా, దానితో ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెంచుకున్న గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.




