
బెంగళూరు : 1969 లో ధర్మాచార్యులు ఉడుపి సభలో సామాజిక సమరసతకై ఇచ్చిన పిలుపు అమలుకు ఆర్ఎస్ఎస్, సామాజిక సమరసతా వేదిక కట్టుబడి వున్నాయని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ప్రకటించారు. నవంబర్ 13న ఉడిపిలోని రాష్ట్రోత్థాన విద్యాలయంలో జరిగిన సభలో హోసబళే ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సభకి పూజ్య శ్రీ ఈశ్వర ప్రియ స్వామి (అదమారు మఠం, ఉడుపి), మాదార చెన్నయ్య స్వామి (చిత్ర దుర్గ) పాల్గొని, ఆశీ: పూర్వక ప్రసంగం చేశారు. వీరితో పాటు సామాజిక సరమసత జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
“1969లో కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన ధర్మాచార్య సమ్మేళనంలో అన్ని పంథాలకు చెందిన ధర్మాచార్యులు అందరూ ముక్తకంఠంతో హిందూ ధర్మంలో అస్పృశ్యతకు తావు లేదనీ, మన అందరి మంత్రం సమానత్వం అనీ ప్రకటించారు. ఈ ఆశయం అమలుకు సంఘం, సామాజిక సమరసత కట్టుబడి ఉన్నాయి” అని ఆర్.ఎస్.ఎస్.సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు.
మరో వైపు ఇదే ప్రాంతంలో నవంబర్ 14,15 తేదీలలో సామాజిక సమరసత జాతీయ సమావేశాలు కూడా జరిగాయి. సభలో సద్గురు మలయాళ స్వామి 1919లో రచించిన ‘శుష్క వేదాంత తమో భాస్కరం’ గ్రంథపు ఆంగ్ల అనువాదం ‘Requisite For Moksha: Caste or Character?’ (ఎమెస్కో ప్రచురణలు), మరియు జనమేజయ హిందీ, కన్నడ భాషలలో వ్రాసిన ‘సంత్ బసవేశ్వరుడు’ పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి. పుస్తక రచయితలు వల్లీశ్వర్, జనమేజయ మరియు ప్రచురణకర్త ఎమెస్కో విజయ కుమార్లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సభకు ఉడిపి నుండి పుర ప్రముఖులు హాజరయ్యారు.
నవంబర్ 14 ఉదయం, 1969 ఉడిపి సభల చిత్ర ప్రదర్శనను, అలాగే సామాజిక సమరసతకు కృషి చేసిన కుద్ముల్ రంగారావు, నారాయణ గురుల చిత్ర ప్రదర్శనలు మరియు వీడియోలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర సంఘచాలక్ డా. వామన శెణై, పూజ్య మాదార చెన్నయ్య స్వామి ప్రారంభించారు.





