
గోసంరక్షణ అనేది మతపరమైన అంశం కాదని, అది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన బాధ్యతని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలో సనాతన గోసంపత్తి ఫౌండేషన్, గోసేవ విభాగం-తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘గో విజ్ఞాన పరీక్ష’లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు.
గవర్నర్ మాట్లాడుతూ..‘‘భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గోసంరక్షణతోనే సాధ్యం. పాఠశాలలు, కళాశాలల్లో గోఆధారిత వ్యవసాయం, పశుసంక్షేమం, గ్రామీణ పారిశ్రామికతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని సూచించారు. బండి సంజయ్ మాట్లాడుతూ..‘‘ప్రపంచమంతా గోఆధారిత వ్యవసాయం (కౌ బేస్డ్ ఫార్మింగ్) వైపు మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోనూ పశు సంపద పెరగాలి. ప్రకృతి వ్యవసాయం, గోమాత గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మోదీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది’’ అని తెలిపారు. రాష్ట్ర మాదక ద్రవ్యాల నిర్మూలన విభాగం డైరెక్టర్ జి.రాంధన్, ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ బి.సుందర్‌రెడ్డి, గోసేవ అఖిల భారతీయ సంయోజక్ అజిత్ ప్రసాద్ మహాపాత్ర, కార్యక్రమ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.





