News

హలాల్ ఆహారం విక్రయించబోమన్నందుకు లండన్‌లో సిక్కు రెస్టారెంట్ ముస్లింల బెదిరింపులు

6views

లండన్: హలాల్ మాంసాహారాన్ని విక్రయించబోమని ప్రకటించిన భారతీయ సిక్కు యజమానికి చెందిన రెస్టారెంట్ చుట్టూ వివాదం ముదిరింది. పశ్చిమ లండన్‌లోని హామర్‌స్మిత్ ప్రాంతంలో ఉన్న ‘సింగ్‌స్ డైనింగ్’ (గతంలో రంగ్రేజ్) రెస్టారెంట్ ఎదుట నవంబర్ 13న వందలాది మంది నిరసన చేపట్టారు. రెస్టారెంట్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మెట్రోపాలిటన్ పోలీసులు రెస్టారెంట్ ఎదుట బారికేడ్లతో భద్రత ఏర్పాటు చేశారు.

రెస్టారెంట్ యజమాని హర్మన్ సింగ్ కపూర్ తన ఆహార విధానాన్ని స్పష్టం చేస్తూ రెస్టారెంట్ బయట ‘Proudly We Don’t Sell Halal’ అనే బోర్డు ఏర్పాటు చేశారు. సిక్కు సంప్రదాయానికి అనుగుణంగా జట్కా మాంసాన్ని మాత్రమే అందించాలన్నది తన విధానమని ఆయన చెబుతున్నారు. ఈ ప్రకటనపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ప్రారంభమైంది.నిరసన సందర్భంగా కొందరు పాలస్తీనా జెండాలు ప్రదర్శిస్తూ ‘అల్లాహు అక్బర్’, ‘షేమ్ ఆన్ యూ’, ‘ఫ్రీ పాలస్తీనా’ వంటి నినాదాలు చేశారు. రెస్టారెంట్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు.

తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయన్న యజమాని
ఈ వివాదంపై హర్మన్ సింగ్ కపూర్ స్పందిస్తూ.. తన ఆహార విధానం, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా తాను, తన కుటుంబ సభ్యులు వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. తన వ్యాపారానికి భద్రత కల్పించాలని చాలాకాలంగా లండన్ మెట్రోపాలిటన్ పోలీసులను కోరుతున్నప్పటికీ తగిన రక్షణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనకు కొన్ని గంటల ముందు పశ్చిమ లండన్‌లోని తన నివాసంలో పోలీసులు తనను అరెస్టు చేశారని ఆయన తెలిపారు. అయితే, ఆయన అరెస్టుకు సంబంధించి హలాల్ ఆహార వివాదమే కారణమని నిర్ధారణ కాలేదు. సోషల్ మీడియాలో ప్రచురించిన ఒక తీవ్ర స్వభావం గల చిత్రానికి సంబంధించిన అనుమానాలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

రెస్టారెంట్ ఎదుట పోలీసుల భద్రత
నిరసన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెట్రోపాలిటన్ పోలీసులు రెస్టారెంట్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు రెస్టారెంట్‌కు దగ్గరగా వెళ్లకుండా పోలీసు సిబ్బంది అడ్డుగా నిలిచారు. నిరసనకారులు రెస్టారెంట్‌ను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో వ్యాపారంపై కూడా ప్రభావం పడిందని యజమాని ఆరోపించారు.ఒక రెస్టారెంట్ తన ఆహార విధానాన్ని ఎంచుకునే హక్కు, నిరసన తెలిపే వారి భావప్రకటన స్వేచ్ఛ, వ్యాపార సంస్థల భద్రత వంటి అంశాలు ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చాయి.