
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో వివాదాస్పద నినాదాలు కలకలం రేపాయి. విశ్వవిద్యాలయ గోడలపై ‘ఫ్రీ కాశ్మీర్’, ‘ఫ్రీ షర్జీల్ ఇమామ్’ వంటి నినాదాలు కనిపించడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నినాదాలపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ నిరసన చేస్తున్న విద్యార్థులను కలిశారు. వివాదాస్పద నినాదాలను ఖండిస్తూనే, విద్యార్థుల ఇతర డిమాండ్లకు మద్దతు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఢిల్లీ పోలీసులు ఆయనను కొద్దిసేపు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థుల్లో ఎవరూ కశ్మీర్ భారత్లో భాగం కాదని చెప్పడం లేదని, విద్యార్థుల ఆందోళనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. విద్యార్థులను తన సొంత పిల్లలుగా భావిస్తున్నానని, వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అన్నారు.
మరో కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వి స్పందిస్తూ.. ప్రస్తుతం జైలులో ఉన్న విద్యార్థులకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలపై ఏబీవీపీ అభ్యంతరం
విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళన సందర్భంగా కొందరు నిరసనకారులు ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలు చేశారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. తమ సంస్థకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన నినాదాలు కూడా చేశారని పేర్కొంది.
ఈ వ్యవహారంపై ఏబీవీపీ విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివాదాస్పద నినాదాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
విద్యార్థి సంఘం ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
మరోవైపు, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు పలు డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. 2006లో రద్దయిన విద్యార్థి సంఘాన్ని పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్ (JMI-SU) ఎన్నికల తేదీని ప్రకటించడం, నిరసన చేస్తున్న విద్యార్థులపై విధించిన క్రమశిక్షణా చర్యలను ఉపసంహరించుకోవడం, భద్రతా సలహాదారు, చీఫ్ ప్రోక్టర్లను వారి పదవుల నుంచి తొలగించడం ఉన్నాయి.
విద్యార్థుల ఆందోళనపై స్పందించిన విశ్వవిద్యాలయ ఉన్నత స్థాయి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థి సంఘానికి ప్రత్యేక రాజ్యాంగం, నియమ నిబంధనలను రూపొందించేందుకు డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. తగిన నిబంధనావళి లేకుండా విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కమిటీ పేర్కొంది.
అలాగే 2026 అక్టోబర్ 12 తర్వాత విద్యార్థులపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలను సమీక్షిస్తామని తెలిపింది. భద్రతా సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని కూడా సిఫార్సు చేసింది.
విద్యార్థి సంఘం ఎన్నికలు వీలైనంత త్వరగా జరిగేలా సహకరించాలని, తమ ఆందోళనను విరమించుకోవాలని విద్యార్థులకు కమిటీ విజ్ఞప్తి చేసింది.





