News

గురుగ్రామ్‌లో మత మార్పిడి ఆరోపణలు.. నలుగురు మహిళల అరెస్టు

5views

గురుగ్రామ్ (హర్యానా): ఉచిత విద్య, ఆహారం అందిస్తామనే పేరుతో చిన్నారులను క్రైస్తవ మతంలోకి మారేలా ప్రలోభపెట్టారన్న ఆరోపణలపై హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు నలుగురు మహిళలను అరెస్టు చేశారు. సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాటా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లల్లన్‌పుయి, అశ్మిత చాహర్, రాజకుమారి చావోబా సింగ్, సుమన్ అనే మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. లల్లన్‌పుయి తన ముగ్గురు సహచరులతో కలిసి సమీపంలోని మురికివాడల్లో నివసించే పిల్లలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉచితంగా చదువు చెప్పడంతోపాటు ఆహారం అందిస్తామని చెప్పి పిల్లలను తమ వద్దకు రప్పించుకునేవారని, అనంతరం వారిని క్రైస్తవ మతంలోకి మారేలా ప్రోత్సహించేవారని ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఈ కార్యకలాపాలు గత ఏడు నెలలుగా ఘాటా గ్రామ పరిసరాల్లో కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉచిత విద్య పేరుతో ఒక ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తూ, పిల్లలకు చదువుతోపాటు ఆహార పదార్థాలు అందించేవారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలను బయటకు తీసుకెళ్లడం, ఇతర ప్రలోభాలకు గురిచేయడం ద్వారా మత మార్పిడికి ప్రేరేపించేవారని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం.

వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న నిందితులు
అరెస్టయిన మహిళల్లో లల్లన్‌పుయి ఒక ప్రైవేట్ సంస్థలో హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. అశ్మిత చాహర్ క్యాన్సర్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. రాజకుమారి చావోబా సింగ్ ఒక ప్రైవేట్ కంపెనీలో లీడ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సుమన్ గత ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ప్రస్తుతం బీఈడీ ప్రవేశం కోసం సిద్ధమవుతున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నామనే పేరుతో మత మార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.