తమిళనాడులో పురావస్తు అధికారులు జరుపుతున్న పరిశోధనల్లో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. సుమారు 4వేల సంవత్సరాల క్రితం నాటి రాతి చిత్రాలను పరిశోధకులు గుర్తించారు. విల్లుపురం జిల్లాలోని కందాచిపురం సమీపంలో ఉన్న ఒట్టంబట్టు తండరై గ్రామ పరిధిలోని కరడిమలై కొండ దిగువన ఈ చిత్రాలు బయటపడ్డాయి. అంతేకాకండా ఆ కాలం నాటి మానవులు రాతి పనిముట్లను పదును పెట్టేందుకు ఉపయోగించినట్లు భావిస్తున్న గుంతలను కూడా పరిశోధకులు గుర్తించారు.
కందాచిపురం సమీపంలో ఉన్న ఒట్టంబట్టు తండరై గ్రామంలో ఈ పరిశోధనలు చేశారు. వెట్టవలం ప్రాంతానికి చెందిన చరిత్ర ఉపాధ్యాయుడు భారతిరాజ, పరిశోధకుడు ఇమ్మాన్యుయేల్ కలిసి కరడిమలై ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలోనే కొండ దిగువన ఉన్న సహజ రాతి ఆశ్రయంలో పురాతన చిత్రాలను గుర్తించారు. ఎర్రటి కాషాయ వర్ణంతో గీసిన ఈ చిత్రాలు సుమారు 4వేల సంవత్సరాల నాటివిగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చిత్రాల్లో ఒక మొక్కను పోలిన ఆకృతి ప్రధానంగా కనిపిస్తోంది. స్థానికంగా వ్యవసాయ పొలాల చట్టు కంచెగా ఉపయోగించే ‘కొప్పర కళ్లి’ మొక్క ఆకారంతో ఇది పోలి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇలాంటి ఆకృతులు గతంలో అలంబాడి, కొల్లూరు ప్రాంతాల్లో గుర్తించిన రాతి చిత్రాల్లోనూ కనిపించినట్లు తెలిపారు.
జింకలు, అడవి పంది ఆకృతులు
ఈ రాతి చిత్రాల్లో మొక్కలాంటి ఆకృతికి ఇరువైపులా జింకలను పోలిన జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. ఎడమవైపు ఉన్న జింక వెనక భాగం మొక్కలాంటి ఆకృతిలో దాగినట్లు ఉంది. కుడివైపు ఉన్న జంతువుకు పొడవైన మెడ కనిపిస్తున్నప్పటికీ, తల భాగం స్పష్టంగా లేదు. వీటిలో ఒక ఆకృతిపై అడవి పంది బొమ్మను పోలిన చిత్రం కూడా కనిపిస్తోంది. ఈ చిత్రాలన్నీ సరళమైన రేఖలతో రూపొందించినట్లు పరిశోధకులు వివరించారు. అప్పటి ప్రజలు తమ చుట్టూ కనిపించే జంతువులు, మొక్కలను చిత్రాల రూపంలో రాతి ఉపరితలాలపై నమోదు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
వర్షపు నీటితో వెలిసిన చిత్రాలు
కరడిమలై ప్రాంతంలోని భౌగోళిక స్వభావం కారణంగా వర్షపు నీరు నేలలోకి సులభంగా ఇంకిపోతుంది. కాలక్రమంలో వర్షపు నీటి ప్రభావం, సహజ వాతావరణ మార్పుల వల్ల రాతిపై ఉన్న కొన్ని చిత్రాలు చెరిగిపోయాయి. మరికొన్ని ఆకృతులు స్పష్టంగా కనిపించడం లేదు. అయినప్పటికీ మిగిలిన చిత్రాలు అప్పటి ప్రజల జీవన విధానం, వారు వేటాడిన జంతువులు, నివసించిన ప్రాంతంలోని సహజ వాతావరణం గురించి విలువైన సమాచారం అందిస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
రాతి పనిముట్ల ఆనవాళ్లుగా మూడు గుంతలు
రాతి చిత్రాలతో పాటు ‘కరడిసునై’ అనే ప్రాంతంలోనూ పరిశోధకులు కీలక ఆధారాలను గుర్తించారు. అక్కడ రాతిపై మూడు గుంతలు లేదా లోతైన అచ్చులు కనిపించాయి. నియోలిథిక్ కాలం నాటి మానవులు తమ రాతి పనిముట్లను రుబ్బేందుకు, పదును పెట్టేందుకు వీటిని ఉపయోగించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గుంతలు ఆ ప్రాంతంలో ప్రాచీన మానవుల నివాసం లేదా కార్యకలాపాలు సాగినట్లు సూచించే ఆధారాలుగా నిలుస్తున్నాయి.
కరడిమలై ప్రాంతంలో బయటపడిన రాతి చిత్రాలు, పనిముట్ల ఆనవాళ్లు వేల ఏళ్ల క్రితం అక్కడ నివసించిన వేటగాళ్లు, ఆహార సేకరణపై ఆధారపడిన సమూహాల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. జంతువుల చిత్రాలు, మొక్కలను పోలిన ఆకృతులు, రాతి పనిముట్లను పదును పెట్టేందుకు ఉపయోగించినట్లు భావిస్తున్న గుంతలు, అప్పటి ప్రజలు ప్రకృతితో ఎంతగా ముడిపడి జీవించారో తెలియజేస్తున్నాయి. ఈ ఆవిష్కరణతో విల్లుపురం ప్రాంతంలోని ప్రాచీన మానవుల చరిత్రపై మరింత పరిశోధనకు అవకాశం ఏర్పడింది.





