
శబరిమల, పంచారామ క్షేత్రాల భక్తులతో పాటు పర్యాటకుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక సర్వీసులకు సంబంధించిన పోస్టర్‌ను కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శబరిమల వెళ్లే భక్తుల కోసం ఈ నెల 16 నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు ‘శబరిగిరి మహోత్సవం’ పేరుతో 5, 6, 7 రోజుల యాత్రా సర్వీసులను ప్రారంభించినట్లు వెల్లడించారు. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు 7382914219, 8309265666, 9959225602 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ముందస్తు టికెట్ల కోసం www.apsrtconline.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చన్నారు.
పంచారామ క్షేత్ర దర్శిని..
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఐదు ప్రముఖ శైవక్షేత్రాల దర్శనానికి ‘పంచారామ క్షేత్ర దర్శిని’ పేరుతో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ద్వారకా బస్‌స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. మరుసటి రోజు సోమవారం అమరావతిలోని అమరేశ్వరుడు, భీమవరంలోని భీమేశ్వరుడు, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరుడు, ద్రాక్షారామంలోని భీమలింగేశ్వరుడు, సామర్లకోటలోని కుమార రామలింగేశ్వరుడిని దర్శించుకునేలా యాత్రను రూపొందించారు. ఈ సర్వీసులకు కూడా ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవచ్చన్నారు.
లంబసింగి, దారమఠానికి ప్రత్యేక సర్వీసులు..
కార్తీకమాసంలో పర్యాటకులు, పిక్నిక్‌లకు వెళ్లేవారి కోసం ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అప్పలనాయుడు వెల్లడించారు. ఈ రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకు ద్వారకా బస్‌స్టేషన్ నుంచి లంబసింగికి, ఉదయం 7 గంటలకు దారమఠానికి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఆయా సర్వీసుల వివరాలు, టికెట్ల రిజర్వేషన్ కోసం 7382914219, 8309265666, 9959225602 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ గంగాధరరావు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కె.గంగాధరరావు, విశాఖ డిపో మేనేజర్ మణిమాధురి, ఉజ్వలారాణి, పీవీవీఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.





