News

గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే : చాగంటి కోటేశ్వరరావు

21views

సనాతన ధర్మంలో గోమాతకు అత్యంత పవిత్రమైన, విశిష్టమైన స్థానం ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. చాగంటి కోటేశ్వరరావు అన్నారు. గోవును కేవలం ఒక జంతువుగా కాకుండా సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి పూజించాలని సూచించారు.

విద్యారణ్య అర్ష ధర్మపరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్‌లోని భద్రకాళి ఆలయ కీర్తి గార్డెన్‌లో రాత్రి ‘గోమాత విశిష్టత’ అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గోమాత మహిమను, సనాతన ధర్మంలో గోవుకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

యజ్ఞయాగాలు, హోమాల్లో ఆవు నెయ్యికి ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు. గోవు ప్రదక్షిణం చేయడం సమస్త దేవతలను పూజించిన ఫలితంతో సమానమని తెలిపారు. గోపూజకు ప్రత్యేకమైన సమయం, సందర్భం అవసరం లేదని, ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే గోమాతను దర్శించుకోవాలని సూచించారు. గోసంరక్షణకు మించిన పుణ్యకార్యం మరొకటి లేదని స్పష్టం చేశారు.

గోవింద నామస్మరణ మహిమాన్వితమైనదని, గోవింద నామాన్ని స్మరించడం వల్ల పవిత్ర స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని అన్నారు. అన్నదానం ప్రాణదానంతో సమానమని, గోదానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఉదయం, రాత్రి గోమాతను స్మరించాలని సూచించారు.

మనిషికి అహంకారం ఉండకూడదని, జీవితంలో చేసే సత్కార్యాలే మన వెంట వస్తాయని, సంపదలు, మేడలు, మిద్దెలు శాశ్వతం కావని హితవు పలికారు. గోమాత వైభవం, విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా ధార్మిక సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భక్తులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.