
బెంగళూరు: కర్ణాటకలో అమల్లో ఉన్న మతమార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2022లో అప్పటి బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడిచినా హామీ అమలు కాలేదని విమర్శించారు.
అక్టోబరు 30న బెంగళూరులో మైనారిటీ, దళిత, రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛకు రక్షణ, మతపరమైన విద్వేషాలకు అడ్డుకట్ట, ఎన్నికల హామీల అమలు ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. శాసనసభలో అవసరమైన బలం ఉన్నందున ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.
కేవలం మతమార్పిడి నిరోధక చట్టమే కాకుండా, గోవధ నిషేధ చట్టాన్ని కూడా పునఃసమీక్షించాలని మచాడో డిమాండ్ చేశారు. కర్ణాటక గోవధ నిరోధక, పశు సంరక్షణ చట్టం-2020 వల్ల ముస్లింలతోపాటు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వృద్ధ, పాలివ్వని పశువులను సంరక్షించడానికి తగినన్ని గోశాలలు లేకపోతే వాటి నిర్వహణ కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం పశువులను వధశాలలకు పంపిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
మరోవైపు, క్రైస్తవ సమాజానికి ప్రభుత్వ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఆ వర్గం ప్రతినిధులు కోరుతున్నారు. సెప్టెంబరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన క్రైస్తవ ప్రతినిధి బృందం మతమార్పిడి నిరోధక చట్టం రద్దుతోపాటు తమ వర్గానికి ఒక శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
కాగా, కర్ణాటక మతమార్పిడి నిరోధక చట్టం బలవంతం, మోసం, ప్రలోభాల ద్వారా జరిగే మతమార్పిడులను నిరోధించడమే లక్ష్యంగా రూపొందించబడింది. అయితే ఈ చట్టం మత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని క్రైస్తవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అక్రమ మతమార్పిడులను అడ్డుకోవడానికి ఇటువంటి చట్టాలు అవసరమనే వాదనలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మతమార్పిడి నిరోధక చట్టం, గోవధ నిషేధ చట్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మత స్వేచ్ఛ, పశుసంరక్షణ, రైతుల ప్రయోజనాలు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం సమతుల్య వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందన్న చర్చ మొదలైంది.





