News

దియా మీర్జా దీపావళి ప్రకటనపై వివాదం.. వీడియో తొలగించిన బీఎంసీ

9views

ముంబయి: పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోవాలంటూ బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన ప్రచారం వివాదానికి దారితీసింది. సినీనటి దియా మీర్జా నటించిన అవగాహన ప్రకటనపై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీఎంసీ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ వీడియోను తొలగించింది. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దీపావళి సందర్భంగా బాణసంచా వల్ల కలిగే వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ హితంగా పండగ జరుపుకోవాలని బీఎంసీ ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. నటి దియా మీర్జా నటించిన ఓ వీడియోలో కాలుష్యాన్ని తగ్గిస్తూ పండగ జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ ప్రకటనపై బిజెపి నేత అమిత్ సతమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపావళి ఎలా జరుపుకోవాలో ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, అది తమ సంస్కృతిలో భాగమని ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో బీఎంసీ దియా మీర్జా నటించిన వీడియోను తొలగించింది. అయితే మాధురీ దీక్షిత్, క్రికెటర్ అజింక్య రహానే, మరాఠీ నటి నిషిగంధా వాడ్ నటించిన పర్యావరణ హిత దీపావళి ప్రచార వీడియోలు మాత్రం కొనసాగడం గమనార్హం. ఈ పరిణామంపై మేయర్‌ రితు తావ్డే స్పందిస్తూ, దియా మీర్జా హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మరోవైపు బీఎంసీ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) తప్పుబట్టగా,బిజెపి నేతలు సమర్థించారు.

వివాదంపై నటి దియా మీర్జా కూడా స్పందించారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పండగలు నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ఆ ప్రకటన రూపొందించినట్లు తెలిపారు. వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి సంబంధించిన అంశమని, దాన్ని తగ్గించేందుకు చేసే ప్రతి ప్రయత్నం పర్యావరణానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. దీంతో దీపావళి ప్రకటన చుట్టూ మొదలైన వివాదం రాజకీయంగానూ, సామాజిక మాధ్యమాల్లోనూ చర్చకు దారితీసింది.