News

టీటీడీ ఉద్యోగులకు ఏఐ శిక్షణ

28views

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై శిక్షణ అందించనున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఉద్యోగుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో 29 మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సామూహిక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ఐఐటీ, ఐసీఏఆర్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. విధుల్లో ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా తక్కువ సమయంలో మరింత సమర్థవంతంగా పనిచేయవచ్చని, తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

టీటీడీ అభివృద్ధిలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని, సంస్థ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారి కృషిని గుర్తించడం బాధ్యతగా భావిస్తున్నామని ఈవో తెలిపారు.