News

గ్వాలియర్‌లో మదర్సాపై బాలల హక్కుల కమిషన్ తనిఖీలు.. 26 మంది పిల్లలకు విముక్తి!

31views

గ్వాలియర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘దారుల్ ఖురాన్’ మదర్సాపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న 26 మంది పిల్లలను అధికారులు రక్షించారు. రెండు గదుల్లో పిల్లలను ఉంచినట్లు గుర్తించగా, విచారణ సమయంలో తమను ఇబ్బందులకు గురిచేశారని, వేధింపులు ఎదుర్కొన్నామని కొందరు పిల్లలు ఆరోపించినట్లు సమాచారం.

అధికారుల తనిఖీల్లో పలు పుస్తకాలు లభ్యమైనట్లు, వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవిగా కమిషన్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. రక్షించిన 26 మంది పిల్లలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. సంబంధిత మదర్సాకు అధికారిక రిజిస్ట్రేషన్ లేదని అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

మరోవైపు, మదర్సాపై జరిగిన తనిఖీలను వ్యతిరేకిస్తూ పలు హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. మదర్సా నిర్వహణలో అక్రమాలు ఉన్నట్లు తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

తనిఖీలను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఈ తనిఖీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏదైనా అక్రమాలు ఉన్నట్లు గుర్తిస్తే మదర్సా యాజమాన్యానికి అధికారిక నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పిల్లలను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. తల్లిదండ్రులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగానే పిల్లలను మదర్సాల్లో చేర్పిస్తున్నారని, వారి అనుమతి లేకుండా పిల్లలను అక్కడ ఉంచడం లేదని ఆయన వాదించారు.

మొత్తంగా గ్వాలియర్‌లోని దారుల్ ఖురాన్ మదర్సా వ్యవహారం మధ్యప్రదేశ్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పిల్లల భద్రత, మదర్సా నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలపై విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.