
చర్చిలో పోప్‌ను ఎన్నుకునే విధానంలోనే శ్రీరంగం శ్రీరంగనారాయణ జీయర్ మఠానికి కొత్త జీయర్ను ఎంపిక చేయాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీయర్ ఎంపిక బాధ్యతను ఆలయ స్థలత్తార్లకు అప్పగించిన ధర్మాసనం.. ఈ ప్రక్రియను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వీరరాఘవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్రీరంగం శ్రీరంగనారాయణ జీయర్ మఠానికి చెందిన 50వ జీయర్ 89 ఏళ్ల వయసులో 2018లో పరమపదించారని, అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయశాఖ 2021లో నోటిఫికేషన్ జారీ చేయగా, పలువురు అర్హులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు నియామకం జరగలేదని తెలిపారు.
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ.. ఆరు నెలల్లోగా కొత్త జీయర్ను నియమించే ప్రక్రియను పూర్తి చేస్తామని కోర్టుకు వెల్లడించారు.
అనంతరం ధర్మాసనం తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. మఠం సంప్రదాయాలు, మార్గదర్శకాల ప్రకారం కొత్త జీయర్ను ఎంపిక చేసే బాధ్యత ఆలయ స్థలత్తార్లదేనని స్పష్టం చేసింది. జీయర్ లేని సమయంలో ఆయనకు సంబంధించిన అధికారాలు స్థలత్తార్లు, భట్టార్లకు బదిలీ అవుతున్నాయని, జీయర్‌కు లభించే గౌరవ మర్యాదలు కూడా వారికే దక్కుతున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితుల కారణంగా కొత్త జీయర్ నియామకంపై వారు ఆసక్తి చూపకపోవచ్చని అభిప్రాయపడింది.
గతంలో 1980లో 50వ జీయర్ నియామకంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి, డిప్యూటీ కమిషనర్ పాత్ర పోషించారని, ప్రస్తుతం కూడా అదే విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారని ధర్మాసనం ప్రస్తావించింది. అయితే, మఠం సంప్రదాయాల ప్రకారం జరగాల్సిన ఎంపిక ప్రక్రియలో అధికారుల జోక్యానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
కొత్త జీయర్ ఎంపిక ప్రక్రియను వివరిస్తూ ధర్మాసనం పోలికను ప్రస్తావించింది. కాథలిక్ చర్చిలో పోప్ ఎన్నిక సమయంలో కార్డినల్స్ సిస్టీన్ చాపెల్‌లో సమావేశమై, కొత్త పోప్ ఎన్నిక పూర్తయ్యే వరకు బయటకు రాకుండా ఉండే విధానాన్ని ఉదహరించింది. అదే తరహాలో ఆలయ స్థలత్తార్లు మఠం ప్రాంగణంలో సమావేశమై, కొత్త జీయర్ను ఎంపిక చేసిన తర్వాతే బయటకు రావాలని సూచించింది.
స్థలత్తార్లు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే, ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వెనుకాడబోదని ధర్మాసనం హెచ్చరించింది.దీంతో దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న శ్రీరంగం జీయర్ పీఠానికి కొత్త వారసుడి ఎంపికపై మరోసారి చర్చ మొదలైంది.





