News

తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు పేర్ల మార్పు చేపట్టాలి: వీహెచ్‌పీ

5views

హైదరాబాద్‌: తెలంగాణలోని నగరాలు, పట్టణాలకు చారిత్రక నేపథ్యం ఉన్న పాత పేర్లను పునరుద్ధరించాలని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) డిమాండ్‌ చేసింది. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు పేర్ల మార్పుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి డా. రావినూతల శశిధర్‌, మఠ్‌ మందిర్‌ అఖిలభారత సంయోజక్‌ ఎం. రామరాజు, వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునితా రాంమోహన్‌ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

చారిత్రక పేర్ల పునరుద్ధరణకు డిమాండ్‌
తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లను తిరిగి వాడుకలోకి తీసుకురావాలని వీహెచ్‌పీ ప్రతినిధులు పేర్కొన్నారు. నిజామాబాద్‌ను ఇందూర్‌, కరీంనగర్‌ను ఎలగందుల, మహబూబ్‌నగర్‌ను పాలమూరు, ఆదిలాబాద్‌ను ఎదులాపురం, మహబూబాబాద్‌ను మానుకోట, వికారాబాద్‌ను గంగారంగా పిలిచే సంప్రదాయాన్ని ప్రస్తావించారు. ఈ పేర్ల చారిత్రక ఆధారాలను పరిశీలించి, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆలయాలకు చెందిన భూముల వివరాలను బహిరంగపరచాలని కోరింది. శ్రీరామ్‌ చౌక్‌లో శ్రీరాముడి విగ్రహం తొలగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ, దేవాలయాలు, హిందూ సంప్రదాయాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

తెలంగాణ చరిత్రలో నిజాం పాలన, రజాకార్ల హింసకు సంబంధించిన ఘటనలను భావితరాలకు తెలియజేయాలని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌, కొమరం భీమ్‌, చాకలి ఐలమ్మ, దాశరథి, కాళోజీ, స్వామి రామానంద తీర్థ వంటి ప్రముఖుల సేవలను స్మరించుకోవాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, వినతిపత్రాలు
సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం త్వరలో జిల్లా, మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు వీహెచ్‌పీ ప్రతినిధులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్లను కలిసి పేర్ల మార్పు, దేవాలయ భూముల పరిరక్షణ తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ చరిత్ర, సంప్రదాయాలు, సాంస్కృతిక గుర్తింపును కాపాడేందుకు ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చింది.