News

చెట్ల సంరక్షణ కోసం విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ- ఆల్గేతో కాగితం తయారీ- లభించిన పేటెంట్

7views

పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం, వాటి సంరక్షణ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే కాగితం తయారీ కోసం పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం పర్యావరణానికి ఒక పెద్ద సవాల్‌గా మారింది. దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు స్కూల్ విద్యార్థులు. ఆల్కే (శైవలం) నుంచి కాగితాన్ని తయారు చేసే ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టి విజయవంతమయ్యారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌కు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభించింది. అంతేకాకుండా ఈ ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా లభించింది. ఈ క్రమంలో విద్యార్థులపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పోఖరి గ్రామంలోని జ్ఞానదా ఇంగ్లీష్ స్కూల్‌లో ఎనిమిది, తొమ్మిదో తరగతులు చదువుతున్న అమే రనడే, అభిరంగ్ కలిసి ఈ అద్భుత ఆవిష్కరణ చేశారు. ఆల్గేలో మొక్కలకు ఉన్న లక్షణాలు ఉంటాయనే సమాచారం ఆధారంగా వీరు ఈ పరిశోధన చేపట్టారు. సుమారు మూడు నెలలపాటు వివిధ ప్రయోగాలు చేపట్టిన తర్వాత ఆల్గే నుంచి కాగితాన్ని తయారు చేసే సరైన విధానాన్ని కనుగొన్నారు. మొదటగా ఆల్గేను సేకరించి పూర్తిగా శుభ్రం చేశారు. ఆ తర్వాత దానిని ఎండబెట్టారు. ఎండిన ఆల్గే నుంచి కాగితం తయారు చేయడానికి అవసరమైన గుజ్జును సిద్ధం చేశారు.

ఆల్గే నుంచి కాగితం తయారుచేసే సరైన విధానాన్ని కనుగొనడానికి తమకు మొదట్లో మూడు నెలల సమయం పట్టిందని ఆవిష్కర్తల్లో ఒకరైన అభిరంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు పూర్తి ప్రక్రియ ఖరారు కావడంతో చిన్న సైజు కాగితాన్ని ఒక వారంలో, పెద్ద సైజు కాగితాన్ని 12-15 రోజుల్లో తయారు చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ఆల్గే నుంచి కాగితాన్ని తయారు చేసే ఈ ప్రయోగం పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడంలో చాలా ముఖ్యమైనదిగా నిలుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

ఆలోచన ఎలా వచ్చిందంటే?
తొలుత అమే రనడేకు ఈ ప్రయోగం ఆలోచన వచ్చింది. ఒకసారి రనడే తన సోదరిని పరీక్ష కేంద్రం వద్ద దింపడానికి వెళ్లారు. అక్కడ కొందరు వ్యక్తులు ప్రకటనల కరపత్రాలను (పాంప్లెట్స్) పంచారు. అయితే ప్రజలు ఆ కరపత్రాలను చదివి రోడ్డుపై పడేయడాన్ని అతను గమనించారు. దీనివల్ల పెద్ద ఎత్తున కాగితం వృథా అవుతోందని ఆందోళన చెందారు. కాగితం వృథాను నివారించడానికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని భావించారు. వెంటనే ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించారు. చెట్లు, ఆల్గే గుణగణాల మధ్య ఉన్న పోలికలను గమనించిన తర్వాత శైవలం నుంచి కాగితాన్ని తయారు చేయవచ్చనే ఆలోచన రనడేకి తట్టింది. దీనిపై మరో విద్యార్థితో కలిసి పరిశోధన చేసి చివరికి ఆల్గే నుంచి కాగితాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ కాగితాన్ని గిఫ్ట్ పేపర్, ఏటీఎం పేపర్, టికెట్ల తయారీ కోసం ఉపయోగించవచ్చని, అయితే దీని కోసం ఇంకా కొంత పరిశోధన, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉందని అమే రనడే పేర్కొన్నారు.

సైన్స్ టీచర్ మార్గదర్శకత్వంలో!
అమే రనడే, అభిరంగ్‌ చేపట్టిన ఈ ప్రయోగానికి జ్ఞానదా ఇంగ్లీష్ స్కూల్‌లోని సైన్స్ టీచర్ సంగీతా పాఠక్ మార్గదర్శకత్వం వహించారు. తమ స్కూల్ విద్యార్థులు చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంపై సంగీత హర్షం వ్యక్తం చేశారు. “విద్యార్థులు ఏదైనా ఒక సరికొత్త ఆలోచనను లేదా భావనను ముందుకు తెచ్చినప్పుడు వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రయోగాల కోసం పాఠశాల, ఉపాధ్యాయులుగా మేము విద్యార్థులకు సాయంగా చేస్తుంటాం. అకడమిక్ విద్యను సమర్థవంతంగా మేనేజ్ చేస్తూనే, తరగతులు ముగిసిన తర్వాత విద్యార్థులకు అదనపు సమయాన్ని కేటాయించి వారికి అవసరమైన సహకారాన్ని అందించాం. స్టూడెంట్స్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించడం సంతోషంగా ఉంది” అని సంగీత పేర్కొన్నారు.

మరోవైపు, తమ స్కూల్ స్టూడెంట్స్ సాధించిన ఘనతపై జ్ఞానద ఇంగ్లీష్ స్కూల్ డైరెక్టర్ మనీషా జోషీ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిర్వహించిన ప్రయోగానికి పేటెంట్ లభించడం పట్ల తాము చాలా సంతోషిస్తున్నామని అన్నారు. విద్యార్థులు గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేశారని చెప్పారు. తమ స్కూల్ విద్యార్థులు సమాజ అభివృద్ధికి దోహదపడడం చాలా సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.