News

శాసనాల చిక్కుముడిపై ఏఐతో శోధన

32views

తమిళుల చరిత్ర, భాష మూలాలు తెలుసుకునేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. వివిధ ప్రాంతాల్లో లభ్యమవుతున్న పురాతన శాసనాలు, తాళపత్రాలు, చిహ్నాల్లోని లిపిని గుర్తించి, అర్థం చేసుకోవడానికి ఏఐను వినియోగించేలా ఓ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పటికే తమిళ్‌ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌తో పాటు మెషీన్‌ లెర్నింగ్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ సాంకేతికతల్ని తీసుకొచ్చారు. దీనికి అదనంగా ఎంజీఆర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ‘కల్వీట్టు ఏఐ’ టూల్‌ను, ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు ప్రాచీన తమిళ అక్షరాల నమూనాలతో ‘తమిళి’ డేటాసెట్‌ను తెచ్చారు. వీటన్నింటినీ ఏఐకి అనుసంధానించారు.

ఎలా గుర్తిస్తారంటే..: తొలుత 3డీ డిజిటల్‌ కన్వర్జేషన్‌ ప్రక్రియ ద్వారా ఏఐ మోడల్స్‌ను వాడి పురాతన శాసనాలు, తాళపత్రాలను డిజిటల్‌ రూపంలోకి తీసుకొస్తారు. ఏఐ కంప్యూటర్‌ విజన్, సెగ్మెంటేషన్‌ టెక్నాలజీల సాయంతో స్పష్టత లేని అక్షరాల్ని గుర్తించి వాటి అసలు రూపాన్ని రూపొందిస్తారు.

  • ఈ అక్షరాల్ని ఏఐ తన డేటాసెట్‌లోని వివరాలతో అనుసంధానించి విశ్లేషిస్తుంది. ఒకవేళ శాసనంపై ఉన్న అక్షరాలు తన డేటాసెట్‌లో లేకపోతే వాటిని స్కాన్‌ చేసుకుని కృత్రిమంగా డేటాసెట్‌ను వృద్ధి చేసుకుంటుంది. చివరగా తమిళ బ్రాహ్మి, వట్టెళుత్తు వంటి ప్రాచీన తమిళ లిపుల్లో ఉన్న అక్షరాలకు సమానమైన ఆధునిక తమిళ అక్షరాలను సూచిస్తుంది. దీని ఆధారంగా శాసనాల్లోని సమాచారాన్ని డీకోడ్‌ చేస్తారు.
  • ఈ ఫలితాల కచ్చితత్వంపై సవాళ్లు ఉన్నాయని భారత పురావస్తుశాఖ సంచాలకులు(ఎపిగ్రఫీ) మునిరత్నంరెడ్డి తెలిపారు. ఏఐని వినియోగించడం మంచి ప్రయత్నమేనని.. కానీ, తమ పరిశీలనలో వాటి ద్వారా కచ్చితత్వాన్ని నిర్ధారించలేకపోయామన్నారు..
  • మరోవైపు సింధూలోయ నాగరికతకు, తమిళానికి సంబంధముందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. కీళడి, ఆదిచ్చనల్లూర్‌ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులకు, సింధూ నాగరికతకు దగ్గరి పోలికలున్నాయని చెబుతోంది. ఈ కోణంలోనూ పరిశోధనలను తీవ్రతరం చేసింది.