News

రాజమహేంద్రవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహావిష్కరణ.

2views

స్వాతంత్య్రం సిద్ధినుంచి 2047నాటికి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చేది హిందూ శతాబ్ధమని సమరసత సేవా సమితి తెలుగు రాష్ట్రాల అఖిల భారత కమిటి సభ్యులు అప్పాల ప్రసాద్ అన్నారు. మన ఇంటివరకే కులమని, బయటకు వస్తే అంతా హిందువులమని భావించాలని ఆయన సూచించారు. తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరంలో హిందూ ధర్మ రక్షకుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఆదివారం సాయంత్రం కంబాల చెరువు సెంటర్ లో మహారాష్ట్ర సాంప్రదాయ డోర్ తాషా వాయిద్యాలనడుమ ఆవిష్కరించారు. జై భవాని, వీర శివాజీ నినాదాల నడుమ సాగిన ఈ వేడుక సందర్బంగా శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు పతివాడ రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన సభలో అప్పాల ప్రసాద్ ముఖ్యవక్తగా పాల్గొన్నారు.

జిజియా మాత కోరిక మేరకు పరమ శివుడు ప్రసాదించిన శివాజీ ఆనాటి ఔరంగజేబు నిరంకుశ దమనకాండకు వ్యతిరేకంగా దండెత్తాడని అప్పాల ప్రసాద్ అన్నారు. 1630లో జన్మించిన శివాజీ 1674లో పట్టాభిషిక్తుడయ్యాడని చిన్నవయస్సు నుంచే తన పరాక్రమం శివాజీ చూపించాడని ఆయన పేర్కొన్నారు. నౌకా నిర్మాణ రూపశిల్పి శివాజీ అని ఆయన కొనియాడారు. శివాజీ వారసులుగా పరాక్రమ వంతులుగా తయ్యారవ్వాలని ఆయన పిలుపు నిచ్చారు. గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం అభినంద నీయమని అన్నారు. ప్రపంచానికి బట్ట కట్టడం నేర్పిన భారతదేశం, ధనియాలు, మిరియాలు మొదలుకుని ఎన్నింటినో ఎగుమతి చేసిందని ఆయన ప్రస్తావిస్తూ, దండయాత్రల కారణంగా 350ఏళ్ళు బానిస పాలనలో మగ్గాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి తిండిగింజలు కూడా లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడామని, ఇప్పుడు పూర్వ వైభవం సాధిస్తూ ప్రపంచంలో నాల్గవ ఆర్ధిక శక్తిగా ఎదిగామని అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు. అనంతరం విగ్రహాన్ని రిమోట్ ద్వారా ఆయన ఆవిష్కరించారు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన ఎమ్మెల్యే సుహాస్ అనీల్‌రావు బాబర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ వేడుక చూస్తుంటే, తాను మహారాష్ట్రలోని ఉన్నట్లుగా ఉందన్నారు. ఛత్రపతి శివాజీ శ్రీశైలం వచ్చాడని ఆయన గుర్తుచేస్తూ, అందుకే శివాజీకి ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉందన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకోసం చేస్తున్న ప్రయత్నం ఫలించి,ఇప్పటికి కార్యరూపం దాల్చిందన్నారు. ఆర్ సుబ్బరాజు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ కి సంబంధించిన ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే తొలుత సంభాజీ మహారాజ్ నాటకాన్ని ప్రదర్శించారు.

ఉదయం సమితి కార్యదర్శి యడ్లపల్లి అయ్యప్ప స్వామి దంపతుల సారధ్యంలో శివాజీ విగ్రహ చెంతన శాంతి హోమం నిర్వహించారు. మధ్యాహ్నం శివాజీ మహారాజ్ జన్మించిన మహారాష్ట్ర రాయగడ నుండి ప్రత్యేకంగా తీసుకు జ్యోతిని దేవి చౌక్ అమ్మవారి పాదాల వద్ద ఉంచి అక్కడినుంచి సభాస్థలి వద్దకు తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు, శ్రీరామ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.