News

వివాహం కోసమే మతమార్పిడిని అంగీకరించలేం: బాంబే హైకోర్టు

6views

కేవలం వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో మతం మారడాన్ని అంగీకరించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, వ్యక్తులు తమ ఇష్టానుసారం మతాన్ని మార్చుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పిస్తోందని పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

థాణెకు చెందిన 70 ఏళ్ల ఇస్లాం మత బోధకుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 25వ అధికరణం మత స్వేచ్ఛకు, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కుకు హామీ ఇస్తోందని, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఈ హక్కులకు విఘాతం కలిగిస్తోందని పిటిషనర్‌ తన వాదనలో పేర్కొన్నారు.

చీఫ్‌ జస్టిస్‌ మహేశ్‌ సీత్రిపాఠి, జస్టిస్‌ అద్వైత్‌ సేథ్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. దేశంలోని లౌకిక స్వభావాన్ని పరిరక్షించడం, బలవంతపు మతమార్పిడుల సమస్యను అరికట్టడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. ప్రతి పౌరుడికీ తన మతాన్ని మార్చుకునే హక్కు ఉందని, అయితే కేవలం వివాహం కోసమే మతం మారడాన్ని అనుమతించలేమని తెలిపింది. ముఖ్యంగా వివాహానికి ఒకటి, రెండు రోజుల ముందు మతం మార్చుకునే విధానాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.

పిటిషన్‌లో నిర్దిష్టమైన వాస్తవాలు, తగిన ఆధారాలు లేనందున ప్రస్తుత పిటిషన్‌ను స్వీకరించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే, అవసరమైన ఆధారాలతో కొత్త పిటిషన్‌ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు అవకాశం కల్పించింది. దీంతో ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అంగీకరించిన పిటిషనర్‌, త్వరలో తాజా పిటిషన్‌ దాఖలు చేస్తానని కోర్టుకు తెలిపారు.