
భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన జాతీయ గేయం ‘వందేమాతరం’పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాకినాడలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయంలోని ఆరు చరణాలను, వాటి తెలుగు అర్థాన్ని ప్రజలకు తెలియజేసేలా కాకినాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆర్డీవో మల్లిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇప్పటివరకు సాధారణంగా బహిరంగ కార్యక్రమాల్లో వందేమాతరం గేయంలోని మొదటి రెండు చరణాలనే ఆలపించేవారు. అయితే, కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 28న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, నిర్దేశిత అధికారిక కార్యక్రమాల్లో గేయంలోని ఆరు చరణాల పూర్తి రూపాన్ని ఆలపించేందుకు, ప్రదర్శించేందుకు సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గేయంలోని పూర్తి పాఠంతోపాటు దాని భావాన్ని తెలుగులో వివరించేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్డీవో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఫ్లెక్సీని ఆసక్తిగా చదువుతున్నారు. జాతీయ గేయం ప్రాముఖ్యతను, అందులోని భావాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే ఈ ప్రయత్నం ప్రజల్లో దేశభక్తి భావనను, జాతీయ గేయంపై అవగాహనను పెంపొందించేందుకు దోహదపడుతోంది.





