
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో నిర్వహించిన బస్తర్ దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బస్తర్ దసరా ఛత్తీస్‌గఢ్ ప్రజల సాంస్కృతిక గర్వానికి, సమిష్టి విశ్వాసానికి సజీవ ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో భాగస్వాములు కావడం విశేషమని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలను ఐకమత్యంతో అనుసంధానించే సంప్రదాయాలు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గతంలో సుదీర్ఘకాలం నక్సలిజం సమస్యను ఎదుర్కొందని రాష్ట్రపతి గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన చర్యల ఫలితంగా ఈ ప్రాంతం నక్సలిజం నుంచి బయటపడి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు, వారి ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించే ప్రయత్నాలు వేగవంతం కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
సమానమైన, సమ్మిళిత అభివృద్ధి ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.
గిరిజన సమాజాలు ప్రకృతిని ఎంతో గౌరవిస్తాయని, ప్రకృతి పరిరక్షణలో వారి జీవన విధానం ఆదర్శప్రాయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అభివృద్ధి ప్రయాణంలో గిరిజనుల సంప్రదాయాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రకృతిని పరిరక్షించడంతోపాటు, దానిని మరింత సుసంపన్నం చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
అంతకుముందు రాష్ట్రపతి మురియా దర్బార్‌లో స్థానిక మాంఝీలు, చాల్కీలతో సమావేశమై మాట్లాడారు. జగదల్పూర్లో ఏర్పాటు చేసిన రంగోలి ప్రదర్శనను, దసరా నేపథ్యంతో రూపొందించిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం మా దంతేశ్వరి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.





