
ఆటోమొబైల్ గ్యారేజీలు, వాహన సర్వీసింగ్ కేంద్రాలకు అవసరమైన పరికరాలను తయారు చేసి సరఫరా చేసే ‘యుపాక్యాప్ ఎక్విప్‌మెంట్’ సంస్థ రూపొందించిన ఓ ప్రచార వీడియో వివాదాస్పదంగా మారింది. గణేశుడిని వాణిజ్య ప్రకటనలో ఉపయోగించి, ఆయన కారును శుభ్రం చేస్తున్నట్లు చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితరాల్లో షేర్ అయిన ఈ వీడియోలో గణేశుడు, ఆయన వాహనమైన ఎలుకను యానిమేటెడ్ రూపంలో చూపించారు. సంస్థ తయారు చేసిన వివిధ పరికరాలను గణేశుడు పరిశీలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
అనంతరం గణేశుడు ప్రెషర్ పంప్‌ను ఉపయోగించి కారును శుభ్రం చేస్తున్నట్లుగా దృశ్యాన్ని రూపొందించారు. ఈ ప్రచార వీడియోపై సోషల్ మీడియాలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మతపరమైన ప్రతీకలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
‘యుపాక్యాప్ ఎక్విప్‌మెంట్’ ప్రధాన కార్యాలయం బిహార్‌లోని పాట్నాలో ఉన్నట్లు సమాచారం. దేశంలోని పలు రాష్ట్రాల్లో సంస్థకు సరఫరా నెట్‌వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోపై సంస్థ నుంచి అధికారిక వివరణ లేదా స్పందన వెలువడిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.